బిచ్కుంద, సెప్టెంబర్ 17: మెనూ పాటించడంలేదని, నాణ్యమైన భోజనం అందించాలని కోరుతూ బిచ్కుందలోని మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాల విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ ప్రిన్సిపాల్ మాకొద్దంటూ నిరసన తెలిపారు. కొన్నిరోజులుగా తమకు గుడ్లు ఇవ్వడంలేదని, నాణ్యమైన భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందించడంలేదని ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు గత శనివారం పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు వారు తెలిపారు. మూడు రోజులు గడిచినా అధికారులు స్పందించక పోవడంతో ప్రిన్సిపాల్ మాకొద్దంటూ బుధవారం విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు 390 మంది విద్యార్థులు చదువుతున్నారని, భోజనం సరిగా పెట్టకపోవడంతో కడుపు మాడ్చుకోవాల్సి వస్తున్నదని వాపోయారు. ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని, ఎవరైనా ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక నాయకులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సముదాయించారు. ఈ విషయమై తహసీల్దార్ వేణుగోపాల్‌ను వివరణ కోరగా.. మెనూ పాటించడంలేదని, నాణ్యమైన భోజనం అందించడంలేదనే మాట వాస్తవమేనని,తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పాఠశాలను సందర్శించి, వివరాలు సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.