హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణకు వరప్రదాయిని అని, కామధేనువు, కల్పతరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టానికి పట్టిన శనేశ్వరం కాంగ్రెస్ అని.. ఈ విషయాలు ప్రజలు తెలుసుకునేదాకా కష్టపడుదామని, సమిష్టిగా పోరాడుదామని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ కేసీఆర్‌ను ‘కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు’గా గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి రూపొందించిన కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంటరీని తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకెళ్లాలని, ప్రతి ఒకరికీ చూపించాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని బీఆర్ఎస్ జిల్లా కార్యాయాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. అవసరమైతే ఫంక్షన్‌హాళ్లలో కూడా దీనిని ప్రదర్శించి కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్నది పచ్చి అబద్ధాలని నిరూపిద్దామని చెప్పారు. ‘ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారం తప్పని నిరూపించేందుకు రాకేశ్‌రెడ్డి చేసిన ప్రయత్నం అభినందనీయం. డాక్యుమెంటరీని రూపొందించిన బృందానికి అభినందనలు’ అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ పనితనానికి ఇదో ఉదాహరణ
మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన రెండు పిల్లర్లను 20 నెలలుగా ఎందుకు మరమ్మతు చేయడం లేదని అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో అడిగితే ప్రభుత్వం సమాధానమే చెప్పలేదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్‌కి గోదావరి నీళ్లు ఎలా తీసుకొస్తారని ఒవైసీ అడిగితే సీఎం గుడ్లు తేలేశారని తెలిపారు. తెలంగాణ తలరాత మార్చిన కేసీఆర్ పనితనాన్ని ప్రపంచం ముందు ఘనంగా చెప్పుకోవడంలో పార్టీగా విఫలమయ్యామని అన్నారు. ‘స్వాతంత్రానికి పూర్వం పోలవరం ప్రాజెక్టు ఆలోచన మొదలైంది. 1940లో పోలవరం ప్రాజెక్టు కట్టాలని అనుకుంటే 1980లో శంకుస్థాపన జరిగింది. 2004లో డిజైన్లు గీశారు. 2014 జూన్‌లో పనులు మొదలయ్యాయి. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తికాలేదు. 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేసి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా స్వల్పకాలంలో నిర్మించారు కేసీఆర్. కేసీఆర్ పనితనానికి, ఇతర ముఖ్యమంత్రుల పనితనానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
చివరి మడికే నీళ్లు రాకపోయేవి
పోచంపాడు ప్రాజెక్టు కింద ఉన్న ఆర్మూరు నియోజకవర్గంలోని చివరి మడికే నీళ్లు రాకపోయేవని కేటీఆర్ గుర్తుచేశారు. ‘సముద్రమట్టానికి 110 -120 మీటర్ల ఎత్తులో కృష్ణా నది ప్రవహిస్తే, గోదావరి 80 నుంచి 100 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది. సముద్రమట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నదిని మేడిగడ్డ వద్ద ఒడిసిపట్టి సముద్ర మట్టానికి 535 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చిన బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం. హైదరాబాద్ నెత్తిపైనున్న నీటి కుండ కొండపోచమ్మ సాగర్‌తో ఇంకో 50 ఏండ్ల వరకు నగరానికి తాగునీటి కొరత రాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. రూ.1,100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుకు గతంలోనే కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఆ ప్రాజెక్టు అంచనాలను ఏడు రెట్లు పెంచి రూ.7,400 కోట్లు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాలోతు కవిత, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, పట్నం నరేందర్‌రెడ్డి, పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నోముల భగత్, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, చిరుమళ్ల రాకేశ్, గజ్జెల నగేశ్, వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నాయకులు తుల ఉమ, శుభప్రద్‌పటేల్, పడాల సతీశ్, కడారి స్వామి తదితరులు పాల్గొన్నారు.
రైతుల నుంచి కేసీఆర్‌ను దూరం చేసే కుట్ర: జగదీశ్‌రెడ్డి
ఏ రైతుల సంక్షేమం కోసమైతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారో.. ఆ రైతుల నుంచి కేసీఆర్‌ను దూరం చేయడానికి కొన్ని శక్తులు ఏకమయ్యాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కట్టడం ద్వారా తమకు నష్టం జరుగుతుందని బనకచర్లకు లైన్‌క్లియర్ కావడం లేదని, కాళేశ్వరాన్ని వ్యతిరేకించే శక్తులకు మీడియాను అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్యమ సమయంలో 10-14 గంటలు పనిచేస్తే, అధికారంలో సీఎంగా 18-20 గంటలు కూడా పనిచేశారని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించేవారని తెలిపారు.
పిట్ట మనసులో కాళేశ్వరం: కేఆర్ సురేశ్‌రెడ్డి
గంగను గుట్ట ఎక్కించి తెలంగాణను గట్టెక్కించిన మహనీయుడు కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి ప్రశంసించారు. 20 ఏండ్లు అధికార, ప్రతిపక్ష సభ్యుడిగా గోదావరి నీళ్ల కోసం పోరాడానని, నేడు కాళేశ్వరం జలాలు పొలాల్లో పారి రికార్డు స్థాయిలో పంట పండుతుంటే సంతోషమేస్తున్నదని చెప్పారు. ‘నాకు చిన్నప్పటి పాట గుర్తుకొస్తున్నది.. ‘గోదారి గట్టుంది.. గట్టుమీద చెట్టు ఉంది.. చెట్టు కొమ్మన పిట్టుంది.. పిట్టమనసులో ఏముంది? అంటే.. గోదావరి జలాలు తెలంగాణ ప్రజలకు అందించే కాళేశ్వరం ఉన్నది అని పేర్కొన్నారు. కేవలం ఆరేండ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించి, ప్రజలకు నీళ్లు అందించి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని ప్రశంసించారు.
సవ్వడే తప్ప.. గొంతు తడపలే: గంగుల
మేడిగడ్డ ప్రాజెక్టును కేసీఆర్ కేవలం 37 నెలల్లోనే రికార్డు టైమ్‌లో కేసీఆర్ నిర్మించారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. 2016 మే 2న అడవిలాంటి ప్రాంతంలో మేడిగడ్డ బరాజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 2019 జూన్ 16 నాడు బరాజ్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలో ఇంత తక్కువ టైమ్‌లో ఇంత భారీ ప్రాజెక్టును ఎవరూ కట్టి ఉండరని, అలాంటి మహత్తర యజ్ఞంలో తమను భాగస్వాములను చేసిన కేసీఆర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. ‘మా ఊరు వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామం. గోదావరికి కిలోమీటర్ దూరంలోనే ఉండేది. రాత్రివేళల్లో గోదావరి ప్రవాహం సవ్వడి వినిపించేది. కానీ, గోదావరి నీళ్లు గొంతును తడపలేదు. పొలాల్లో పారలేదు. సాగు నీళ్లు పొలాలకు మలుపుకొచ్చేందుకు మా తాతలు, తండ్రులు రక్తాలు చిందించాల్సిన పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంతో పొలాల్లో భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి’ అని చెప్పారు.
కాంగ్రెస్ కూలుతుందే తప్ప ప్రాజెక్టు కూలదు: సత్యవతి రాథోడ్
కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందే తప్ప ప్రాజెక్టు కూలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు. వానకాలంలో నిత్యం 10-12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా ప్రాజెక్టు చెక్కు చెదరలేదని తెలిపారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేసీఆర్ నాయకత్వంతో తిరిగి అద్భుతంగా ప్రాజెక్టును తయారు చేసుకొని మరిన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చుకుంటామని చెప్పారు. ఎస్సారెస్పీ పునరుద్ధరణ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు అయిన డోర్నకల్ నియోజకర్గం వరకు గోదావరి జలాలను కేసీఆర్ పారించడంతో నాడు పండుగలు చేస్తున్నామని గుర్తుచేశారు.
ప్రజలకు నిజాలు తెలియజెప్పే ప్రయత్నం: డాక్యుమెంటరీ రూపకర్త రాకేశ్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అపోహలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్న తరుణంలో ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరంపై డాక్యుమెంటరీని రూపొందించినట్టు బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి చెప్పారు. వివిధ అంశాల్లో పట్టు కలిగిన ఐదుగురు సభ్యుల బృందంతో మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి కాళేశ్వరం డాక్యుమెంటరీని రూపొందించామని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పార్టీ నాయకులు ఇందుకు సహకారం అందించారని పేర్కొన్నారు. అనంతరం రాకేశ్‌రెడ్డితోపాటు ఆయన బృందాన్ని కేటీఆర్ ఘనంగా సత్కరించారు.
కాంగ్రెస్ నేతలవి చిల్లర మాటలు
మేడిగడ్డ ప్రాజెక్టులోని 85 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రూ.లక్ష కోట్ల కుంభకోణం అంటే.. ఆయనకు పిల్లనిచ్చిన మామ మాత్రం అదేమీ లేదని కొట్టి పారేశారని గుర్తుచేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకైన ఖర్చు రూ.93,769 కోట్లు అని పేర్కొన్నారు. ఇందులో మేడిగడ్డ బరాజ్‌కు భూసేకరణతో కలుపుకుని అయిన ఖర్చు దాదాపు రూ.4 వేల కోట్లు అని, సిమెంట్ నిర్మాణానికి మాత్రమే అయిన ఖర్చు రూ.1,500 కోట్లకు మించదని వివరించారు. ఏడో బ్లాక్‌లో కుంగిన రెండు పిల్లర్లను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చు రూ.300 కోట్లు అని, బరాజ్ నిర్మించిన ఎల్అండ్టీ సంస్థనే తన పైసలతో మళ్లీ నిర్మిస్తామని అంటున్నదని పేర్కొన్నారు. ఇందులో ప్రజాధనం ఎకడ వృథా అయింది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కమీషన్ పేరుతో రేవంత్ సర్కారు రూ.3 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి కొండను తవ్వి ఎలుకును కూడా పట్టుకోలేకపోయింది’ అని కేటీఆర్ మండిపడ్డారు.
కాళేశ్వరం మల్టీపర్పస్ ప్రాజెక్టు
కాళేశ్వరం మల్టీపర్పస్ ప్రాజెక్టు అని కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ సీఎం అయ్యేదాకా తెలంగాణ రైతులు కన్నీళ్లనే తప్ప సాగునీళ్లను చూడలేదన్నారు. సాగు, తాగునీటితోపాటు పరిశ్రమల అవసరాలను తీరుస్తుందని చెప్పారు. రాష్ర్టాన్ని ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిపిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో కరువొచ్చినా, కడెం, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకపోయినా కాళేశ్వరం నుంచి మూడు మార్గాల ద్వారా నీళ్లు తీసుకొనేలా గొప్ప డిజైన్‌తో నిర్మించినట్టు తెలిపారు. సాధారణ వర్షపాతం నమోదైనా గోదావరి నిండితే కాకతీయ కాల్వ ద్వారా నీళ్లు తీసుకోవడం ఒక మార్గమని చెప్పారు. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైతే ఎస్సారెస్పీ నిండితే వరద కాలువ ద్వారా నీళ్లు నింపుకోవడం మరో మార్గమని తెలిపారు. ఈ రెండూ లేనప్పుడు తెలంగాణకు కరువొస్తే గోదావరిలో నీళ్లు ఉండేది ఒక్క మేడిగడ్డలో మాత్రమేనని, అందుకే కాళేశ్వరం కల్పతరువు, కామధేనువు అని పునరుద్ఘాటించారు.
తెలంగాణ ప్రజల జీవితం.. కాళేశ్వరం: పల్లా
కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని, రాకేశ్‌రెడ్డి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశంసించారు. నాడు కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని, మానవ మాత్రులు ఎవరూ పడనంత కష్టం కేసీఆర్ పడ్డారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశారని చెప్పారు. కాంట్రాక్టు సంస్థ అధిపతులతో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇది మీకు ఒక ప్రాజెక్టు మాత్రమే. కానీ, తెలంగాణ ప్రజలకు ఇది జీవితం’ అని చెప్పారని గుర్తుచేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు పంజాబ్‌లో దొరుకుతాయి.. అంటే అక్కడి షాపువాళ్లతో కూడా కేసీఆర్ స్వయంగా మాట్లాడి త్వరగా వచ్చేలా చేశారని తెలిపారు.