హైదరాబాద్ నడిబొడ్డున మహారాష్ట్ర పోలీసులు 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకొంటే హోంమంత్రిగా వ్యవహరిస్తున్న సీఎంకు కనీస సమాచారం లేకపోవడం దురదృష్టకరం. నెలల తరబడి ఇంత పెద్ద అరాచకం నడుస్తుంటే ఈగల్ టీం, హైడ్రా తమాషాలు చూస్తున్నాయా?
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తేతెలంగాణ): కమీషన్ల కోసం ఎల్‌అండ్‌టీపై రేవంత్‌రెడ్డి బెదిరింపులకు దిగారని, కాబట్టే వారు పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాన్క్లేవ్లో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైలులో పెడతానని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. వివాదంలో ఉన్న భూములను ముడుపులు తీసుకుని తెగనమ్మేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. వివాదాస్పద కంపెనీల బాధ్యులకు కేసులను చూపించి బెదిరించి ముడుపులు కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముం దుకొచ్చిన అనేక కంపెనీలు ఆయన వైఖరితోనే ఇతర రాష్ర్టాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 22 నెలల పాలనలో కమీషన్లు దండుకోవడం, ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ మొదలు గ్రూప్-1 పరీక్ష వరకు ప్రతి పనికి ముడుపులు దండుకుంటున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి.. ముడుపుల రేవంత్‌రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన ముసుగులో నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ ఒక్క మంచిపనైనా చేసిండా?
22 నెలల పాలనలో రేవంత్‌రెడ్డి చేసిన మంచి పని ఒక్కటున్నా చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాను కోరారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న సబ్బండ వర్ణాలు ఇప్పుడు అరిగోస పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు, ఆరోగ్యశ్రీ సేవల రద్దుతో దవాఖానలు, నిరుపేదలు, యూరియా కొరతతో రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, రేషన్ డీలర్లు, పారిశుధ్య కార్మికులు ఆందోళనబాట పడుతున్నారని గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సాకులు చూపి, కేంద్రంపై నెపంనెట్టి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. కేసీఆర్ నివసించిన ప్రగతిభవన్, ఆయన నిర్మించిన కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకున్న నీచుడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌పై కక్షతోనే మేడిగడ్డకు మరమ్మతు చేయించకుండా పక్కనబెట్టారని ఆరోపించారు. ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (టీఆర్పీ) ఏర్పాటుపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు పార్టీలు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు.
ఓ వైపు అవినీతి..మరోవైపు బంధుప్రీతి
కాంగ్రెస్ హయాంలో అవినీతికి, బంధుప్రీతికి తావులేదని, రేవంత్‌రెడ్డి వాటినే విధానాలుగా మార్చుకున్నారని కేటీఆర్ తూర్పారబట్టారు. తన బావమరిది సృజన్‌రెడ్డి, అన్న అమిత్‌రెడ్డికి, మామ పద్మారెడ్డికి కాంట్రాక్ట్‌లు ఎందుకిచ్చారని ప్రశ్నించారు.
సిరిసిల్ల నేతన్నలకు దగా
వ్యక్తిగతంగా తనపై పగ సాధిస్తున్న రేవంత్‌రెడ్డి సిరిసిల్ల నేతన్నలను దగా చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలు ఇచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు మాత్రం మహిళా సంఘాల సభ్యులకే పరిమితం చేస్తున్నదని, అవి కూడా ఇస్తదో? లేదో? తెలియదని వ్యాఖ్యానించారు.
అన్నీ ‘హైడ్రా’మాలే
రేవంత్ గద్దెనెక్కాక హైడ్రా తెచ్చి పెద్దల ఇండ్లను కాపాడుతూ, పేదల నివాసాలపై బుల్డోజర్లతో విరుచుకుపడ్డారని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా పేరిట డ్రామాలు నడుపుతూ ముడుపులు దండుకుంటున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తన గుర్తును హస్తానికి బదులు బుల్డోజర్గా మార్చుకోవాలని దెప్పిపొడిచారు. హైదరాబాద్ నడిబొడ్డున మహారాష్ట్ర పోలీసులు రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకొంటే హోంమంత్రిగా వ్యవహరిస్తున్న సీఎంకు కనీస సమాచారం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. నెలల తరబడి ఇంత పెద్ద అరాచకం నడుస్తుంటే ఈగల్ టీం, హైడ్రా తమాషాలు చూస్తున్నాయా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తున్నది
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తున్నదని పేర్కొన్నారు. జగిత్యాలలో ఆ పార్టీ అగ్రనేత జీవన్‌రెడ్డి పరిస్థితే ఇందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ప్రజలకే కాకుండా పార్టీ నాయకులకు కూడా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిజంగా అద్భుతమైన పాలన ఉంటే వెంటనే ఉప ఎన్నికలు పెట్టి ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఫాంపై ఎంపీగా పోటీచేసిన దానం నాగేందర్ స్పీకర్‌ను కలవడం ద్వారా లాభం లేదని, ఆయనపై వేటు తప్పదని చెప్పారు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపు ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము చేయించిన ఆరేడు సర్వేల్లోనూ ఇవే ఫలితాలు వచ్చాయని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు చేయించిన మూడు సర్వేల్లోనూ తమ పార్టీ గెలుస్తుందనే విషయం స్పష్టమైందని చెప్పారు. ఓటమి భయంతో అధికార పార్టీ అరాచకాలు సృష్టించే ప్రమాదమున్నదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పాలన నిజంగా అద్భుతంగా ఉంటే వినాయక చవితి, మిలాద్ ఉన్నబీ పండుగల్లోను ప్రజలు కేసీఆర్‌ను ఎందుకు తలచుకుంటారని ప్రశ్నించారు.
ఆడబిడ్డల ప్రాణాలకు విలువలేదా?
హైదరాబాద్‌లో ఇద్దరు ఆడబిడ్డలు హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిపై లైంగికదాడి చేసి హత్య చేసినట్టు తెలుస్తున్నా హోంమంత్రికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఆడబిడ్డల ప్రాణాలు అంత చులకనైపోయాయా? ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. రేవంత్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంపీలను అమ్మేసిన ఘనుడు
పరిపాలించడం చేతగాని రేవంత్‌రెడ్డి అమ్మడం, కొనడంలో మాత్రం అరితేరారని కేటీర్ దెప్పిపొడిచారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను మేకలు, గొర్రెల మాదిరిగా బీజేపీకి బేరంపెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా, పీఆర్ మేనేజ్మెంట్పై నడుస్తున్నదని ఎద్దేవా చేశారు.
ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్‌కు గాలం
అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో స్క్వేర్కట్లతో అలరించిన మాజీ క్రికెటర్‌ను సైతం రేవంత్‌రెడ్డి రాజకీయ స్క్వేర్ కట్‌తో బొల్తా కొట్టించారని పేర్కొన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు ఆయనను భ్రమలో ముంచుతున్నారని అన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో అజారుద్దీన్ ఎంపికను గవర్నర్ ఆమోదించే పరిస్థితిలేదని అన్నారు.
సీఎం కుటుంబానికే ‘వికాసం’
యువ వికాసం పేరిట యువత నుంచి లక్షల దరఖాస్తులు తీసుకున్న కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏ వర్గానికీ వికాసం లేదని, ముఖ్యమంత్రి, ఆయన కుటుంబానికి, బంధువులకు వికాసం కలుగుతున్నదని చెప్పారు.
మోదీ మెప్పుకోసమే సీబీఐ విచారణ
ప్రధాని మోదీ మెప్పు పొంది పదవిని కాపాడుకొనేందుకే కాళేశ్వరంపై రేవంత్ సీబీఐ విచారణకు ఆదేశించారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రులకు సైతం తెలియకుండా మోదీ, బండి సంజయ్ డైరెక్షన్లోనే ఎైంక్వెరీ డ్రామాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు. బీజేపీ, రేవంత్ సర్కారు, సంజయ్ చీకటి ఒప్పందాలకు అనేక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. ‘పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ చేసి ఏడాదైనా వివరాలు ఎందుకు వెల్లడించడంలేదు? సెర్చ్ పంచనామా చేయలేదెందుకు? సోదాల్లో భాగంగా నోట్లు లెక్కించే యంత్రాలను తీసుకెళ్లి సాధించిందేంటి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అమ్ముకున్నారని అభ్యర్థులే చెప్పారు
అన్ని వర్గాల మాదిరిగానే నిరుద్యోగులకు కూడా రేవంత్‌రెడ్డి శఠగోపం పెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. గ్రూప్-1లో జరిగిన అక్రమాలే ఇందుకు నిదర్శనమని స్పష్టంచేశారు. రూ. 3 కోట్లకు ఉద్యోగాలను అమ్ముకున్నారని అభ్యర్థులే ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించారు. డబ్బులు తీసుకున్న మంత్రుల పేరుచెప్పినా విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతతో పెట్టుకుంటే పతనంకాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మైత్రీ బంధంతోనే బీజేపీ మౌనం
రాష్ట్రంలో అనేక అరచకాలు జరుగుతున్నా, గ్రూప్-1పై విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నా బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ నిలదీశారు. రేవంత్‌తో మైత్రీబంధం కారణంగానే నోరు విప్పడం లేదని విమర్శించారు. 42 శాతం కోటాపై కపట నాటకంబీసీలకు 42 శాతం కోటాపై కాంగ్రెస్ కపట నాటకం ఆడుతున్నదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మీడియాకు లీకులిస్తూ బలహీనవర్గాల బిడ్డలతో చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో, ఆర్డినెన్స్‌ల పేరిట డ్రామాలు చేస్తున్నదని విమర్శించారు.
మహాలక్ష్మి పథకంతో ఉపాధి కరువు ; కేటీఆర్‌తో గోడు వెళ్లబోసుకున్న ఆటోరిక్షా కార్మికులు
మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆటోరిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో కార్మిక నాయకులతో కలిసి బుధవారం ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత తమకు ఆర్థిక సమస్యలు పెరుగుతూ వచ్చాయని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ హయాంలో తమకు అమలైన రూ.5 లక్షల ప్రమాద బీమా కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదని మండిపడ్డారు. మైనారిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం పర్మిట్లతోపాటు సబ్సిడీతో ఆటోలు ఇచ్చినట్టు గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో తమకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కే మద్దతునిస్తామని ఆటోరిక్షా కార్మికులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా తమకు 10 లక్షల వరకు ఓట్లు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో సాయి, మహేశ్, స్వామిదాసు, రమేశ్ తదితరులు ఉన్నారు.
మూర్ఖత్వంతోనే ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే రద్దు
ఎలాంటి భూ సేకరణ అవసరం లేకుండా కేసీఆర్ హయాంలో రూపొందించిన ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రభుత్వం మూర్ఖంగా రద్దుచేసిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. గతంలో ఎక్స్‌ప్రెస్ వే భూమిని ఓఆర్ఆర్ ప్లాన్‌లో ఉంచామని, మెట్రో రైలు కోసం ఉంచిన భూమిని ప్రస్తుతం వాడుకోవచ్చని చెప్పినా వినలేదని మండిపడ్డారు. సర్కారు తెలివిలేని నిర్ణయంతో ఐటీ పరిశ్రమకు నష్టంవాటిల్లే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒక మంత్రేమో మొన్న మా ప్రభుత్వం మళ్లా వచ్చేది లేదు..సచ్చేది లేదని అంటున్నరు. మరో మంత్రేమో రీజినల్ రింగ్ రోడ్డు అయ్యేది కాదు..పోయేది కాదు అని చెప్తున్నరు. ముఖ్యమంత్రి మాత్రం రెండేండ్లలో పూర్తిచేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అని ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికలపై వెనుకడుగు ఎందుకు?
ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ సర్కారు స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎందుకు వెనుకాడుతున్నదని కేటీఆర్ ప్రశ్నించారు. నాడు ఓట్ల కోసం ఇచ్చిన హామీలకు పాతరేసిన హస్తం పార్టీకి ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యంలేకే ముఖం చాటేస్తున్నదని తూర్పారబట్టారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని హెచ్చరించారు.
కాంగ్రెస్ హయాంలో అవినీతికి, బంధుప్రీతికి తావులేదని నాడు ఓట్ల ముందర గప్పాలు కొట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు వాటినే విధానాలుగా మార్చుకున్నారు. తన బావమరిది సృజన్‌రెడ్డి,అన్న అమిత్‌రెడ్డికి, మామ పద్మారెడ్డికి కాంట్రాక్ట్‌లు ఎందుకిచ్చారు?
-కేటీఆర్
గ్రూప్-1లో జరిగిన అక్రమాలు జరిగాయని సాక్షాత్తూ హైకోర్టే ఆధారాలతో బయటపెట్టింది. సర్కారు మాత్రం అప్పీల్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నది. రూ. 3 కోట్లకు ఉద్యోగాలు అమ్ముకున్నారని అభ్యర్థులే ఆరోపిస్తున్నారు.
–కేటీఆర్