వేల్పూర్ : రైతులకు యూరియా ( Urea ) బస్తాను ఇవ్వలేని అసమర్ధ ఎంపీలు ( MPs ) పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే ( MLA ) , మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి( Vemula Prashanth Reddy ) డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో మీడియాతో మాట్లాడారు.
ఎంపీ అరవింద్ ( MP Aravind ) కు పలుకుబడి ఉంటే మోదీ దగ్గరికి వెళ్లి యూరియా తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. యూరియా సమస్యపై గత నెల రోజుల నుంచి బీఆర్ఎస్ అన్ని వేదికల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నా, రేవంత్ రెడ్డిని ప్రజలు తిడుతున్నా, శాపనార్థాలు పెడుతున్నా దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో రైతులు చెప్పులు , పాస్ బుక్‌లు లైన్లో పెట్టే పరిస్థితి మళ్లీ వచ్చిందని విమర్శించారు. నిజామాబాద్, బాల్కొండ నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. తండాల్లో నుంచి వచ్చి యూరియా తీసుకుపోవడానికి ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వానికి కనబడడం లేదని ఆరోపించారు.
బాల్కొండ మండలంలో 100 సంచుల యూరియా రాగా 10 గ్రామాలకు ఎన్ని ఇస్తావు ? మెండోరా, వేల్పూరు మండలంలో వెయ్యికి 90 సంచులు వచ్చాయి. ఎట్లా పంచుతారు ? మోర్తాడ్ మండలం డోన్ పాల్ గ్రామంలో పోలీసులను పెట్టీ టోకెన్లు పంపిణీ చేశారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా ? తోర్తి గ్రామంలో కూడా ఇదే కష్టాలు ఉన్నాయని అన్నారు.
ఢిల్లీకి మూటలు పంపడం తప్ప వేరే ధ్యాస లేదని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కమీషన్లు దండుకోవడం మీదనే దృష్టి పెట్టారు.
ప్రజల, రైతులు కష్టాలు మాత్రం పట్టవని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక రైతులకు అవస్థలు ఎదురవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు 16 మంది ఎంపీలు ఉన్నారు. రైతులు ఇబ్బంది పడితే ఎంపీలు ఏమి చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడని మీ పదవులు ఎందుకని ప్రశ్నించారు. రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే అరవింద్ ఎక్కడికి వెళ్లాడు ? పెద్ద మాటలు, అడ్డగోలుగా తిట్టే అరవింద్ యూరియా ఎందుకు తెప్పించడం లేదని నిలదీశారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు మోదీ వద్దకు వెళ్లి యూరియా తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్( KCR ) ప్రభుత్వంలో ఏనాడు ఇలా చూడలేదు. కేసీఆర్ దూర దృష్టి రైతులకు స్వర్ణ యుగంగా విలసిల్లింది. ముందుగానే లెక్కలు వేసి కేంద్రానికి మంత్రుల బృందాన్ని పంపి యూరియా తెప్పించే వారని పేర్కొన్నారు. యూరియా బస్తా ఇప్పించలేని అసమర్థ పాలకులని, మోదీని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ఎంపీలకు ఎందుకు లేదని, బడే భాయ్‌కు కోపం వస్తుందా ? చోటే భాయ్ కి ఇబ్బంది కలుగుతుందనా అంటూ ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లాకు 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 72 వేల యూరియా వచ్చిందని అధికారులు చెపుతున్నారు. మరి వచ్చిన యూరియా ఎటు వెళ్ళింది ? కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్ కు వెళ్లిందా ? రైతులు స్టాక్ పెట్టుకుంటున్నారు అని కాంగ్రెస్ నేతలు, అధికారులు అంటున్నారని, రైతు ఏమైనా యూరియా తింటారా ? అంటూ ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుకు యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ ఎంపీలు రాజీనామా చేయాలని, పదవుల్లో ఉండడానికి అర్హత లేదని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.