ధర్మపురి, సెప్టెంబర్17: ‘కరెంటు బిల్లు కట్టలేని నీ బతుకెందుకు? చావు’ అంటూ విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది ఘాటైన మాటలతో వినియోగదారుడిని అవమానించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వినియోగదారుడు సమీపంలోని కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించగా, బంధువులు రోదించడంతో కిందికి దిగివచ్చాడు. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో బండారి లక్ష్మణ్ కార్ సర్వీసింగ్ సెంటర్ నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. ఇంట్లో పిల్లల ఆరోగ్యాలు బాగోలేకపోవడంతో దవాఖాన ఖర్చులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతడి ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు కొంత పెండింగ్లో ఉన్నది. బుధవారం విద్యుత్తు అధికారులు, సిబ్బంది దాదాపు 15మంది లక్ష్మణ్ ఇంటికి వచ్చారు. బిల్లు ఎప్పుడు కడతావని అడిగారు.
తన దీనపరిస్థితిని చెప్పుకొని ఒక్కరోజు సమయం ఇవ్వాలని కోరాడు. అధికారులు వినిపించుకోకుండా ‘కరెంటు బిల్లు కూడా కట్టలేని నీ బతుకెందుకు? చావు’.. అంటూ ఘాటైన మాటలతో వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ పక్కనే ఉన్న కరెంటు పోల్ ఎక్కాడు. విద్యుత్తు సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో కరెంట్ సరాఫరాను నిలిపివేయగా ప్రమాదం తప్పింది. బంధువులు రోదించడంతో లక్ష్మణ్ కిందకు దిగొచ్చాడు. తన ఇంటికి సంబంధించిన కరెంట్ మీటర్లో లోపం ఉన్నదని, కేవలం రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్లైట్ల వాడకానికి నెలకు రూ.3 వేల పైచిలుకు బిల్లు వస్తున్నదని, మీటర్ మార్చాలని పలుమార్లు అధికారులతో విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.