దేవుండ్ల పేర్లు చెప్పి, రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి కొందరు మోసం చేసిన్రు. అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలే. పసుపుబోర్డు పేరిట మోసం చేసిన వ్యక్తిని రైతులు, ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. మరోసారి అటువంటి వాళ్లను నమ్మి మోసపోవద్దు
– ఏర్గట్లలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఏర్గట్ల, ఫిబ్రవరి 24: కల్లబొల్లి మాటలు చెప్పి, గ్రామాల్లో ఒక్క పైసా అభివృద్ధి పనులు చేయని వారిని ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఏర్గట్లలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.12 లక్షలతో నిర్మించిన సొసైటీ అదనపు గదులు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అలయం వద్ద రూ.18 లక్షలతో నిర్మించిన మండపం, మండలంలోని తాళ్ళ రాంపూర్‌లో రూ.16 లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్‌ను మంత్రి ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తాళ్ళ రాంపూర్‌లో రూ.20లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దేవుడి పేరుతో, రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకొని, రైతులను పసుపు బోర్డు పేరిట మోసం చేసిన వ్యక్తిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి వారికి మరోసారి నమ్మి మోసపోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయడంలో ముందుంటానని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ కోలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్, సర్పంచులు గుల్లే లావణ్యా గంగాధర్, భీమనాతి భానుప్రసాద్, సొసైటీ చైర్మన్లు బర్మ చిన్న నర్సయ్య, పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ సింగసారం గంగారాం, కమ్మర్పల్లి ఏఎంసీ డైరెక్టర్లు అంజిరెడ్డి, దేవన్న యాదవ్, నాయకులు గంగారాం నాయక్, జైనుద్దీన్, బద్దం శ్రీనివాస్‌రెడ్డి, బద్దం ప్రభాకర్, బోనగిరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని మత గ్రంథాలు బోధించేది అందరూ బాగుండాలని..
భీమ్‌గల్, ఫిబ్రవరి 24: ఏ మత గ్రంథమైనా అంద రూ బాగుండాలని చెబుతుందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్‌గల్ పట్టణంలోని సిలువ చర్చ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రీస్తు ఆశీర్వాద సభకు మంత్రి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలని కోరుకోవాలన్నారు. కానీ ఈమధ్య దేశంలో స్వార్థ, వింత పోకడలను చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్నిమతాలు సమానంగా గౌరవించబడుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రిని క్రైస్తవ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. జడ్పీటీసీ చౌట్పల్లి రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు మోయిజ్, సిలువ, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్ రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ శివసారి నర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, చర్చి ఫాదర్ శద్రక్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్ తదితరలు పాల్గొన్నారు.