మోర్తాడ్, జూలై 13: ‘సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నది..అభివృద్ధి చేయడం మా వంతు.. మీ నుంచి మేము కోరుకునేది మాత్రం మీ ఆశీర్వాదమే’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం మోర్తాడ్, వడ్యాట్ గ్రామాల్లో రూ.10కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ కుళాయి నీరు ఇచ్చినట్లుగా.. ప్యాకేజీ -21ద్వారా మోర్తాడ్ ప్రాంత రైతులకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వర్షాలు కురవకున్నా రైతులు ఇబ్బందులు పడొద్దని కాళేశ్వరం జలాలను తెప్పించి సాగునీరు అందేలా చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్, వర్షాభావ పరిస్థితుల్లో కాళేశ్వరం జలాలను రప్పించే ఏర్పాట్లు చేసి అన్నదాతకు అండగా నిలబడితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం రైతులకు హానీ తలపెట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రైతుల అవస్థల గురించి తెలిసిన కేసీఆర్ 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. అనవసరంగా 24గంటల విద్యుత్ ఇస్తున్నాడని, మూడు గంటల విద్యుత్ చాలని అన్యాయంగా, దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రిపూట మూడు గంటల కరెంట్ ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్లీ మనకు కావాలా…అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మూడు గంటల కరెంటే ఇస్తామని అన్నాడని, ఈ విషయంపై రైతులు ఆలోచన చేయాలని కోరారు. దేశానికే అన్నం పెట్టే రైతును మనదేశంలో అన్నదాత అని పిలుస్తారని, అటువంటి అన్నదాతకు సున్నం పెట్టాలని చూస్తున్న పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రైతులదంతా ఒకే కులమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రైతు సంక్షేమం కోసం కృషిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీలు, కులాలు, రాజకీయాలకు అతీతంగా రైతు సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చే నీళ్లు, కరెంటు ఒక్క బీఆర్ఎస్ రైతుల పొలాల్లోకి మాత్రమే వెళ్లడంలేదన్నారు. చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు. కోడిగుడ్డుమీద ఈకలు పీకే వారి మాటలు నమ్మవద్దని సూచించారు.
రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
మోర్తాడ్ తక్కూరివాడ నుంచి పెద్దవాగు వరకు రూ.2.90కోట్లతో నిర్మించే తారురోడ్డు, మోర్తాడ్ నుంచి వయా వడ్యాట్ మీదుగా బషీరాబాద్ రోడ్డు వరకు రూ.6.80కోట్లతో చేపట్టనున్న డబుల్‌రోడ్డు నిర్మాణ పనులకు మోర్తాడ్, వడ్యాట్ గ్రామాల్లో శంకుస్థాపనలు చేశారు. వడ్యాట్‌లో మంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు, డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఎంపీపీ శివలింగుశ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్సదేవన్న, డీసీసీబీ డైరెక్టర్ మోత్కుభూమన్న, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, సర్పంచులు బోగ ధరణి ఆనంద్, వెల్మరూప రవీందర్, ఎంపీటీసీలు రాజ్‌పాల్, శాస్త్రి, కళావతి, గంధం మహిపాల్, సత్యనారాయణ, జేసీ గంగారెడ్డి, చిన్నరాజేశ్వర్, ఇంతియాజ్, రంజిత్, ప్రకాశ్, నర్సాగౌడ్, రమేశ్, దడివె నవీన్, ఏనుగు రాజేశ్వర్, బాలమల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.