ఏర్గట్ల, ఏప్రిల్ 5 : ఎస్సారెస్పీ లీకేజీ నీళ్ల కోసం పడ్డ ఆరాటం నుంచి 365 రోజులు కాలువలు నిండు నీటితో పారే అభివృద్ధిని బాల్కొండ నియోజకవర్గంలో సాధించుకున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తన సతీమణి నీరజా రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ రూ.1900 కోట్లతో రివర్స్ పంపింగ్ పథకాన్ని నిర్మించుకొని ఎస్సారెస్పీని నింపుకోవడమే కాకుండా ఎస్సారెస్పీ వరద కాలువ, కాకతీయ కాలువను మూడు కాలాలు నీళ్లందించేలా మార్చుకున్న ప్రగతి పయనం మనదని గుర్తుచేశారు. పాత లిఫ్టులు బాగు చేసుకొని, కొత్త లిఫ్టులు మంజూరు చేసుకొని, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకొని సాగు నీటి కష్టాలను దూరం చేసుకున్నామన్నారు. బిందెడు నీళ్ల కోసం పొద్దంతా బజారు నల్లా దగ్గర పడిగాపులు కాసే రోజుల నుంచి ఇంటి వద్దనే మహిళలు నీళ్లు పట్టుకొనేలా చేసి ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చామన్నారు.
భీమ్‌గల్‌లో మిషన్ భగీరథ నీటి ట్యాంకును ప్రారంభించిన రోజు.. తులం బంగారం అప్పుకు దొర్కుతుండె గానీ బిందెడు నీళ్లు మాత్రం దొర్కకపోయేవి అని ఓ ముసలమ్మ అన్న మాటలను మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో 12వేల గ్రామాలకు, అన్ని గిరిజన తండాలకు మిషన్ భగీరథ ద్వారా నల్లా నీటిని ఇంటింటికీ అందించిన నాయకుడు దేశంలో కేసీఆర్ మాత్రమేనన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక మొరుగుతున్న వాళ్లకు బీఆర్ఎస్ కుటుంబ సోషల్ మీడియా వారియర్స్ భాజాప్తా తగిన సమాధానం చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యం తన అదృష్టమని, ఇది తనను ఎన్నుకున్న నియోజకవర్గ అభివృద్ధికి దోహదమవుతున్నదని సంతోషం వ్యక్తంచేశారు.
చంద్రబాబు చెంచా రేవంత్ రెడ్డి..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణను అరిగోస పెట్టిన చంద్రబాబు నాయుడికి చెంచా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆర్టీఏ బ్లాక్ మెయిలర్ అయిన రేవంత్… సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను విమర్శించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. గోడలకు రంగులు వేసుకునే రేవంత్ రెడ్డికి నేడు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. నోటుకు ఓటుతో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరన్నారు.
తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు..
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నయా పైసా కూడా లేదని మంత్రి వేముల స్పష్టం చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథకు చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద వచ్చే నిధులు రాష్ర్టాల హక్కు అని మరోసారి స్పష్టం చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ను తెలంగాణ అభివృద్ధికి వాడుకోవడంలో కేసీఆర్ తెలివి, మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చే సత్తా రాష్ర్టానికి ఉండడంతోనే దేశంలో 20 ఉత్తమ గ్రామాలు ఎంపికైతే అందులో 19 గ్రామాలు తెలంగాణవే నిలిచాయని వివరించారు. ఎన్ఆర్ఈజీఎస్ను కేంద్రం ఇస్తున్న నిధులుగా బీజేపీ నాయకులు చెప్పుకోవడాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలే పట్టుగొమ్మలు
బీఆర్ఎస్కు కార్యకర్తలే పునాది అని, పార్టీకి, పార్టీ నాయకత్వానికి వారే పట్టుగొమ్మలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలకు కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులతో కలిసి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. ఈ సమ్మేళనాల్లో తాను కూడా తన సతీమణితో కలిసి పాల్గొంటుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నర్సింహ నాయుడు, మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజా పూర్ణానందం, ఎంపీపీ కోలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, వైస్ ఎంపీపీ సల్ల లావణ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్, కోఆప్షన్ సభ్యుడు అశ్రఫ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సున్నపు అంజయ్య, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, కూతురు సాయన్న, డాక్టర్ కృష్ణ, బోనగిరి రమేశ్, ఏశాల నర్సా రెడ్డి, అశోక్ రెడ్డి, నాగిరెడ్డి రాజశేఖర్, సుభాష్ రెడ్డి, సర్పంచులు గుల్లె లావణ్యా గంగాధర్, పద్మాసాగర్ రెడ్డి, పత్తి రెడ్డి ప్రకాశ్, గద్దె రాధాగంగారాం, మోత్కూరి మంజులా బాలాజీగౌడ్, కుండ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బండి..
పేపర్ లీకేజీ, గలీజు రాజకీయంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మంత్రి వేముల మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలే టెన్త్ పేపర్‌ను ఫొటోలు తీసి బండి సంజయ్‌కు పంపడం, బండి సంజయ్ మీడియాకు పంపడం ప్రభుత్వంపై బురద జల్లే కుట్రకు నిదర్శనమని పేర్కొన్నారు. దొంగే దొంగదొంగ అని అర్చినట్లు బండి వ్యవహారం ఉందన్నారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇంత బాధ్యతరాహిత్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. బండిని అరెస్టు చేసి చట్టం తన పని తాను చేసిందని..బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తే భౌతికదాడులు తప్పవని హెచ్చరించారు.