కమ్మర్పల్లి, జూలై 16: వానలు లేవు, వాగులు వట్టిపోయాయి. సీజన్ మొదలై నెలన్నర కావస్తున్నా సరైన వానలు కురవక బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగు వట్టిపోయిన పరిస్థితి. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో వానల్లేకుండానే వాగు వరదై పారిన అద్భుత దృశ్యం కాళేశ్వరం జలాలతో ఆవిష్కృతమైంది. వందల కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం జలాలు వచ్చి వాగులను పారిస్తున్నాయి. పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీలోకి చేరుతున్న కాళేశ్వరం జలాలు.. ప్యాకేజీ 21 పథకంతో బ్యాక్‌వాటర్ సమీపంలోని బినోలా నుంచి 16కిలోమీటర్ల టన్నెల్గుండా సారంగాపూర్ పంప్‌హౌస్‌కు చేరి అక్కడి నుంచి నిజాంసాగర్ కెనాల్ ద్వారా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటున్నాయి. అక్కడ సీఎం కేసీఆర్ అందించిన బాహుబలి పైప్‌లైన్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగులోకి భారీ ప్రవాహంగా దూకి వాగులో వరదై పారుతూ కొత్త చరిత్ర సృష్టించింది.
వట్టిపోయిన వాగుల్లో కాళేశ్వర పరవళ్లు..
కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలోకి చేరడం ఒక చరిత్ర అయితే, వానల్లేకుండానే వాగుల్లో పారడం మరోచరిత్ర. భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం వరకు వట్టిపోయి కనిపించిన కప్పలవాగు.. మధ్యాహ్నం తర్వాత కాళేశ్వరం జలాలతో పరవళ్లు తొక్కుతూ కనిపించింది. ఇక నుంచి ప్యాకేజీ 21 పథకంతో కాళేశ్వరం జలాలు వానలు లేకుండానే కప్పల వాగు, పెద్దవాగులో ప్రవహించే సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. దీంతో బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్, వేల్పూర్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాలు శాశ్వతంగా లబ్ధి పొందుతాయి. వచ్చే యాసంగి తర్వాత ప్యాకేజీ 21లో భాగంగా మూడెకరాలకు ఒక పెద్ద సాగునీటి నల్లా ఏర్పాటు పనులు పూర్తి కానుండడంతో భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ మండలాల్లో 80వేల ఎకరాలు సాగునీటి ప్రయోజనాన్ని పొందనున్నాయి.
వరదలై పారిన ఆనందం..
భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ సమీపంలోని పెదంగంటి ఎల్లమ్మక్షేత్రం వద్ద ప్యాకేజీ 21 ద్వారా వచ్చిన కాళేశ్వరం జలాలను కప్పలవాగులోకి మంత్రి వేముల ఆదివారం విడుదల చేశారు. జోరుగా వచ్చిన కాళేశ్వరం జలాలు కప్పలవాగులో దుంకుతూ.. చూస్తుండగానే వాగు మొత్తాన్ని విస్తరించాయి. ఈ దృశ్యాన్ని చూసిన మంత్రి వేముల రైతులతో కలిసి ఆనందంలో మునిగిపోయారు. జలాల వద్ద కలియతిరుగుతూ పులకించిపోయారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డిని రైతులు తమ భుజాలపై ఎత్తుకొని జై కేసీఆర్, జై ప్రశాంత్‌రెడ్డి నినాదాలతో హోరెత్తించారు.
నీళ్ల కష్టాలు తీరాయి..
ఇన్ని ఏండ్లలో ఎన్నడు కూడా సూడలేదు. వాన పడకున్నా వాగులో నీళ్లు పారుతున్నాయంటే.. దీనంతటికీ కారణం సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. యాడనో కాళేశ్వరంలో ఉన్న నీళ్లను మా వాగులో పడేలా చేసిండు. మాకు ఇగ ఢోకా లేదు. నీళ్ల కష్టాలు తీరినాయి. సీఎం కేసీఆర్, మంత్రి వేములకు రుణపడి ఉంటాం.
– గంగారపు సురేశ్, రైతు, భీమ్‌గల్
కేసీఆర్‌కు రైతులంటే ప్రేమ..
300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నీళ్లను మా గ్రామంలోని కప్పలవాగులో పారిస్తున్నారంటే సీఎం కేసీఆర్‌కు రైతులంటే ఎంత ప్రేమనో కనబడుతుంది.నీళ్లను చూస్తుంటే సంబురమేస్తున్నది. నీళ్ల రంది తీరినట్లే. ఎండిపోయిన పొలాలకు ప్రాణం వచ్చింది. ఇది నిజంగా రైతు ప్రభుత్వం.
– పుప్పాల రాజు, రైతు, బెజ్జోర
నీళ్ల కష్టాలకు ఫుల్స్టాప్…
వానలు సకాలంలో పడక చాలా ఇబ్బందులు పడ్డాం. వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతే చూడలేకపోయాం. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో నీళ్ల కష్టాలకు ఫుల్స్టాప్ పడ్డట్లే. కాళేశ్వరం నీళ్లు కప్పలవాగులోకి రావడంతో సంతోషంగా ఉన్నది.
– మూడెడ్ల గోపాల్, రైతు, బెజ్జోర
కలలో కూడా అనుకోలేదు..
కలలో కూడా అనుకోలేదు. వర్షం పడకున్నా కప్పలవాగులో నీళ్లు పారుతాయని. కాళేశ్వరం నీళ్లతోనే ఇది సాధ్యమైంది. మాకు వర్షం పడకున్నా నీళ్లగోస తీరినట్లే. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం. రైతుల కోసం ఇన్ని సౌలతులు చేస్తుండ్రు మీకు రుణపడి ఉంటాం సారు.
– కర్నె చిన్నయ్య, రైతు, భీమ్‌గల్