వేల్పూర్, ఫిబ్రవరి 23: ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హైలెవల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ పెద్దవాగుపై రూ.15 కోట్లతో , మోతె కప్పలవాగుపై రూ.12కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిలను మంత్రి వేముల గురువారం ప్రారంభించారు. ఈ వంతెనల నిర్మాణంతో వేల్పూర్-భీమ్‌గల్ మార్గంలో రవాణా సదుపాయం మరింతగా మెరుగుపడినట్లయింది. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే తన నియోజకవర్గంలో రెండు హై లెవల్ వంతెనలను పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఇంత స్వల్ప వ్యవధిలో బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేయవచ్చని, ఆచరణాత్మకంగా నిరూపించిన ఆర్అండ్బీ అధికారులు, స్థానిక కాంట్రాక్టర్లను మంత్రి అభినందించారు. రికార్డు టైమ్‌లో పూర్తయిన వేల్పూర్, మోతె బ్రిడ్జిలు రాష్ర్టానికి మార్గదర్శకంగా నిలువబోతున్నాయని తెలిపారు. బ్రిడ్జిల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వేల్పూర్, మోతె గ్రామాల సర్పంచులు తీగెల రాధ, రజిత, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర, వైస్ ఎంపీపీ బోదెపల్లి సురేశ్, ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, వేల్పూర్ గ్రామకమిటీ అధ్యక్షుడు సుంకె కమలేశ్, వేల్పూర్ ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేశ్, దున్న రాజేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.