కంఠేశ్వర్, అక్టోబర్ 4: పేదలకు దసరా కానుకగా త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్లను అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లలో సౌకర్యాలు కల్పించి, అర్హులైన వారికి త్వరలోనే అందించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖతో పొంగులేటి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల తీరుపై ఆరా తీశారు.
ధరణి దరఖాస్తుల పరిష్కారం, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఎల్ఆర్ఎస్, విద్య, వైద్యారోగ్య శాఖల పనితీరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే తదితర అంశాలపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అంశాల వారీగా సమీక్షించిన మంత్రి పొంగులేటి.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను విజయదశమి కానుకగా పేదలకు అందించాలని, జిల్లా ఇన్చార్జి మంత్రి పర్యవేక్షణలో అర్హులైన వారిని ఎంపిక చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణ ప్రగతిపై పంచాయతీరాజ్ ఈఈ సరిగా సమాధానం చెప్పక పోవడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి విడుతగా త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 4 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు పొంగులేటి చెప్పారు.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా నెలాఖరులోపు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. విద్య, వైద్య శాఖల్లో సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, కబ్జాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా వదలొద్దని స్పష్టం చేశారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి, వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారానే ప్రభుత్వ పథకాలను అందించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వివిధ సంస్థల చైర్మన్లు అనిల్ ఈరవత్రి, తాహెర్, సీపీ కల్మేశ్వర్ సింగేనవార్, అధికారులు పాల్గొన్నారు.