నిజామాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘంలో వెలుగు చూసిన అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తున్నది. ఒక వైపు అక్రమార్కులపై చట్టపరంగా చర్యలకు రంగం సిద్ధం చేస్తుండగా… మరోవైపు డిపాజిటర్లకు నష్టం కలుగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నారు. గతంలో కొంత మంది వ్యక్తుల మూలంగా అవినీతి మరకలు అంటిన తాళ్లరాంపూర్ సొసైటీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులకు లాభం జరిగే విధంగా కట్టుదిట్టమైన చర్యలకు సహకార శాఖ అడుగులు వేస్తున్నది. వివిధ రూపాల్లో ఉన్న మొత్తం 9 స్థిరాస్తులను ఈ -వేలంలో విక్రయించి వాటి ద్వారా వచ్చిన సొమ్మును బకాయిల చెల్లింపునకు వెచ్చించేందుకు తాళ్లరాంపూర్ మహాజన సభ గతంలోనే నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వానికి ఆస్తుల విక్రయంపై విన్నవించగా ఇందుకు అనుమతులు రావడంతో ఏప్రిల్ 11న ఈ-వేలం కోసం ప్రకటన సైతం విడుదలైంది. 25వ తేదీ వరకు ఈ-వేలంలో పాల్గొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
తప్పు నిజమే…
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ సహకార సంఘం ఒకప్పుడు లాభాల బాటలో పయనించింది. సంఘం ఆధ్వర్యంలో తాళ్లరాంపూర్, గుమ్మిర్యాల్, తడపాకల్, దోంచంద గ్రామాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. రూ.కోట్ల నిధులు దారి మళ్లించినట్లు, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన విషయాలు బయటికి పొక్కాయి. కొందరు రైతులు కలెక్టర్‌తో పాటు సహకార శాఖ కమిషనర్, లోకాయుక్తా, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యా దు చేశారు. దీనిపై ఆయా వ్యవస్థలు వివరణ కోరు తూ జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశాయి. పీఏసీఎస్‌లో అక్రమాలపై సెక్షన్ 51ప్రకారం విచారణ చేయాల్సిందిగా జిల్లా సహకార అధికారి సింహాచలం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సత్యనారాయణను ఆదేశించారు. 2012-13 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలపై విచారణ జరిపారు. 2021, మార్చి 19న ప్రారంభమైన విచారణ 3 నెలల 20 రోజులు పా టు కొనసాగింది. రూ.6.5 కోట్ల రైతుల డిపాజిట్లు, రూ.5కోట్ల బ్యాంక్ రుణాలు, రూ.1.5 కోట్ల వినియోగాన్ని పరిశీలించారు. నిధుల వినియోగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తేలింది. కార్యాలయ భవన నిర్మాణం, పరిపాలన భవనంలో వి లాసవంతమైన సౌకర్యాలు, రైస్ మిల్, ఫంక్షన్ హా ల్, 20 వరకు గోదాములు నిర్మించారు. వాటిలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చారు.
డిపాజిటర్లకు భద్రత…
తాళ్లరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో డిపాజిట్ల చెల్లింపులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నది. తాళ్లరాంపూర్ వ్యవసాయ సహకార సంఘంలో నిధుల దుర్వినియోగంపై జరిగిన విచారణలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సోమ చిన్నగంగారెడ్డి, కార్యదర్శి బి.స్వామి రిజర్వ్ బ్యాంకు, నాబార్డు సూచనలు పాటించకుండా సభ్యులు, సభ్యులేతరుల నుంచి డిపాజిట్లు స్వీకరించి అధిక వడ్డీ రేట్లను చెల్లించారు. డిపాజిట్ల సొమ్మును సంఘంలో నిర్మాణాలకు మళ్లించారు. ఇందుకు బాధ్యులైనందున వారి నుంచి ఉమ్మడిగా రికవరీ చేయాలని నివేదికలో సూచించారు. ఈ ప్రక్రియ చట్టపరంగా కొనసాగుతోంది. డిపాజిట్ల సొమ్మును సంఘం కార్యాలయ భవనం, రైస్ మిల్లు, కల్యాణ మండపం, గోదాముల నిర్మాణానికి మళ్లించినందున డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆస్తులను విక్రయించి డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేయాల్సిందిగా తాళ్లరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ ఈ మధ్యనే తీర్మానం చేసిది. ప్రభుత్వానికి ఆస్తుల విక్రయంపై విన్నవించింది. సర్కారు సైతం రైతుల మేలు కోసం ఆలోచించి ఆస్తుల అమ్మకానికి అనుమతులు మంజూరు చేయగా ఈ -వేలం ప్రకటన వెలువడింది.
మంత్రి వేముల ప్రత్యేక చొరవ…
ఆరుగాలం శ్రమించి రైతులు పోగు చేసుకున్న డిపాజిట్లు తిరిగి చెల్లించి ఖాతాదారులను ఆదుకునేందుకు మొదటి నుంచి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతులు రోడ్డు మీద పడకుండా ఉండేందుకు ప్రభుత్వపరంగా భరోసా కల్పిస్తున్నారు. సొసైటీ నిధులతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిన వారి నుంచే రికవరీకి ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. రైతుల డిపాజిట్లను త్వరితగతిన చెల్లించేందుకు తాళ్లరాంపూర్ పీఏసీఎస్‌కు చెందిన 9 స్తిరాస్థులను ఈ-వేలంలో విక్రయించాలని సొసైటీ మహాజన సభ తీర్మానం ప్రకారం అనుమతులు మంజూరులోనూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టి సారించడంతో ప్రభు త్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడింది. రైస్ మిల్, కల్యాణ మండపం, గోదాములను ఈ-వేలంలో విక్రయించి దాదాపు రూ.7.50కోట్లు సేకరించాలని సహకార శాఖ నిర్ణయించింది.