ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు (బుధవారం) కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడలో రూ.135 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. రామన్న రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు సమాయతమయ్యాయి. 50 వేల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బాన్సువాడ, అక్టోబర్ 3: బాన్సువాడ నియోజకవర్గానికి నేడు (బుధవారం) ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఈ నియోజకవర్గంలో రూ. 135 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. రామన్న రాక నేపథ్యంలో ఏర్పాట్లను స్పీకర్ పోచారం మంగళవారం పరిశీలించారు. హెలీప్యాడ్, సభాస్థలితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బాన్సువాడకు రానున్న కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు జరుగున్నాయి.
రూ. 135 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
బాన్సువాడ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ భారీగా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం పట్టణానికి చేరుకోనున్న రామన్న.. తొలుత దళితుల అభ్యున్నతి కోసం రూ.1.50 కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవన్‌ను, అలాగే, పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం రూ.4 కోట్లతో నిర్మించిన మల్టీ జనరేషన్ పార్కు, చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించనున్నారు. రూ. 2 కోట్లతో నిర్మించనున్న ధోబిఘాట్కు, రూ. 37.50 కోట్లతో నిర్మించనున్న ఏరియా దవాఖాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, 3కోట్లతో నిర్మించిన మున్సిపాలిటీ కార్యాలయం, రూ. 1.50 కోట్లతో నిర్మించి ఆర్డీవో ఆఫీసు, రూ. 85 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, సోలార్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభిస్తారు. అనంతరం వీక్లీమార్కెట్లో 50 వేల మందితో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు.
ప్రగతి మేడ.. బాన్సువాడ
స్పీకర్ పోచారం నాయకత్వంలో బాన్సువాడ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లు సహా ఇతర అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ముందున్నది. ఒకప్పుడు మున్సిపాలిటీగా కూడా లేని ఈ పట్టణం స్పీకర్ చొరవతో తెలంగాణలోనే నంబర్‌వన్‌గా ఎదిగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని పోచారం అద్భుతంగా తీర్చిదిద్దారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటేనే బాన్సువాడ నియోజకవర్గం గుర్తుకొచ్చేలా.. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 11 వేల ఇండ్లు మంజూరు చేయించిన ఘనత స్పీకర్‌కే దక్కింది. అందులో సగానికి పైగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయగా, మిగతావి త్వరలోనే లబ్ధిదారుల చేతులకు అందబోతున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో రూ.10వేల కోట్లతో మౌలిక సదుపాయాలు, సంక్షేమ ఫలాలు ప్రజల దరికి చేరుకున్నాయి. సర్వ సౌకర్యాలతో బాన్సువాడ పట్టణం కొంగొత్తగా మారింది. అన్ని గ్రామాలకు సింగిల్ బీటీ రోడ్లు, మండల కేంద్రాల నుంచి నియోజక వర్గం కేంద్రానికి అటాచ్ రోడ్లు అన్ని డబుల్ రోడ్లుగా మారాయి. పోచారం ప్రత్యేక చొరవతో అటవీ ప్రాంతం గుండా బాన్సువాడ – కామారెడ్డి రహదారిని నిర్మించారు. సుమారు 6 కిలో మీటర్ల మేర అటవీ శాఖ క్లియరెన్సులు తీసుకువచ్చి బీటీ రోడ్డు వేయించడంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలకు ఎంతో లాభం జరుగుతోంది. వాగులు, వంకల్లో, మంజీర నదిపై వంతెనలు, గ్రామాలు, తండాల్లో రూ.600కోట్లతో రోడ్లు వేయించారు.
భారీగా ఏర్పాట్లు..
రామన్న రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఘనంగా స్వాగతం పలకనున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి జనాన్ని బహిరంగ సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. 50వేల మందికి సభకు వస్తారని అంచనా వేసిన బీఆర్ఎస్ నాయకులు..ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. రామన్న రాక సందర్భంగా బాన్సువాడ పట్టణం కేటీఆర్, పోచారం ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీవనంగా మారింది.
రెండు పంటలకు సాగునీరు..
వట్టిపోయిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సీఎం కేసీఆర్ సహకారంతో పూర్వవైభవం తీసుకొచ్చారు పోచారం. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నాన్ కమాండింగ్ ఏరియాలో గట్టు మీది గ్రామాలకు సాగు సాటి కోసం నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా చివరి ఆయకట్టుకు నీళ్లు అందించేలా రూ.200కోట్లతో సిద్దాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, రూ.150కోట్లతో చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను అమలు చేయిస్తున్నారు. మరోవైపు నిజాంసాగర్ ప్రధాన కాలువ మరమ్మతులు, కట్ట బలోపేతం కోసం రూ.150కోట్లతో పనులు చేపట్టారు. ప్రస్తుతం సాగు నీటి సౌకర్యం పెరగడంతో బాన్సువాడ నియోజకవర్గంలో లక్షన్నర ఎకరాల్లో ఏటా రెండేసి పంటలు పండుతున్నాయి
హెల్త్, ఎడ్యుకేషన్ హబ్‌గా..
బాన్సువాడ హెల్త్, ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. బాన్సువాడ సామాజిక దవాఖాన జిల్లా దవాఖానగా మారింది. ప్రత్యేకంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. బాన్సువాడ దవాఖాన సాధారణ ప్రసవాల్లో నిత్యం రికార్డులు సృష్టిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలను అందుకుంటోంది. బాన్సువాడ మాతా శిశు సంరక్షణా కేంద్రంలో నవజాత శిశువులకు పుట్టిన గంటలోపే పసిబిడ్డకు ముర్రుపాలు పట్టించే విధానం అమలు చేస్తుండటంతో బ్రెస్టు ఫీడింగ్ ఫ్రెండ్లీ ఇన్షియేటివ్ అవార్డును దక్కించుకుని జాతీయ స్థాయిలో గుర్తింపును పొందింది. కార్పొరేట్ తరహాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బాలికల, బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు అయ్యాయి. నర్సింగ్ కళాశాల, బీర్కూర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రుద్రూర్లో ఫుడ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, గురుకుల విద్యాలయాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. తెలంగాణ తిరుమల తిరుపతి ఆలయంగా ప్రసిద్ధి గాంచిన బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకన్న కొండను కేసీఆర్ ఆశీస్సులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక్క బాన్సువాడ పట్టణంలో రూ. 650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.
వేలాదిగా తరలిరావాలి
బాన్సువాడ నియోజకవర్గానికి భారీగా నిధులు ఇస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్, కేటీఆర్, స్పీకర్ పోచారంలకు ధన్యవాదాలు తెలిపే అవకాశం వచ్చింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలి రావాలి.
– పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్