నిజామాబాద్, సెప్టెంబర్ 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రొటోకాల్ లేదు.. ఏం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస మర్యాదా లేదు. ఉమ్మడి జిల్లాలో ఓడినోళ్లదే రాజ్యం అన్నట్లు నడుస్తున్నది. అధికార
కార్యక్రమాల్లో అనధికార వ్యక్తులదే హవా కొనసాగుతున్నది. అధికార యంత్రాంగం సైతం నిబంధనలకు విరుద్ధంగా సాగే తంతుకు వత్తాసు పలుకుతున్నది. తాజాగా మంత్రి జూపల్లి నిజామాబాద్ జిల్లా పర్యటననే ఇందుకు నిదర్శనం. ప్రజల ఓట్లతో గెలిచినోళ్లను కావాలనే నిర్లక్ష్యానికి గురి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైనం విమర్శలకు తావిస్తున్నది. ఇన్చార్జి మంత్రి లేకలేక నిజామాబాద్ జిల్లా పర్యటనకు రాగా, ఆయన సమక్షంలోనే ప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా జరిగింది. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఎదుటే ఈ తతంగం కొనసాగడం గమనార్హం.
ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారు. మొన్న జరిగిన దిశ సమావేశంలోనూ బీజేపీ ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఈ అంశాన్ని లేవనెత్తారు. అధికార కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం తీరు మార్చుకోలేదు సరికదా మంత్రి పర్యటనలో అనధికార వ్యక్తులకు ఎర్ర తివాచీ పరవడం విమర్శలకు తావిచ్చింది. ప్రజాస్వామ్య విలువలపై ఊదరగొట్టే రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి.. తమ నాయకుల వ్యవహార శైలిపై మాత్రం నోరెత్తడం లేదు. ఎమ్మెల్యేలను కాదని అనధికార వ్యక్తులకు గులాంగిరి చేస్తున్న ఆయా శాఖల అధికారులపై చర్యలుతీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారు హోదాలో షబ్బీర్ అలీ తళుక్కుమనగా, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కనిపించక పోవడంపై సర్వత్రా చర్చ జరిగింది. మరోవైపు, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ సైతం తన సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మరోవైపు, మంత్రి పదవి రాక కాస్త అసంతృప్తిగా ఉండడంతోనే బోధన్ ఎమ్మెల్యే.. మంత్రి పర్యటనకు రాలేదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొనడంతో అనుమానాలకు తెరపడింది.
బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, భీమ్‌గల్ మండలాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ బిల్డింగ్‌లను ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, సహకార శాఖ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డితో కలిసి ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అయితే, ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతల శైలి విమర్శలకు తావిచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారే మంత్రి పర్యటనలో హల్చల్ చేయడం చూసిన వారిని ముక్కున వేలేసుకునేలా చేసింది.
బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు స్వయంగా మంత్రితో కలిసి ప్రారంభోత్సవాల్లో పాలు పంచుకున్నారు. ఆర్మూర్‌లో జరిగిన కార్యక్రమంలోనూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వినయ్‌రెడ్డి పాల్గొనడం, హల్చల్ చేయడం దుమారం రేపింది. దీనిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి.. మంత్రి జూపల్లి ఎదుట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ అర్బన్‌లో జరిగిన రోడ్డు శంకుస్థాపనలో ముఖ్య అతిథులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నరాల రత్నాకర్ పాల్గొనడం విశేషం.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి,
ఆర్మూర్‌లో బీజేపీ నుంచి పోటీ చేసిన పైడి రాకేశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వీరికి రాజ్యాంగబద్ధంగా ప్రొటోకాల్ ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటిదేమీ జరగడం లేదు. వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి చేతిలో ఓడిన సునీల్‌రెడ్డి, వినయ్రెడ్డిలకే రాచమర్యాదలు దక్కుతున్నాయి. ఇందుకు సోమవారం నాటి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనే ఉదాహరణ. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో సాక్షాత్తు కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సమక్షంలోనే కాంగ్రెస్ నేతలకు పెద్దపీట వేశారు.
ఓడినోళ్ల హవాలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేలు చిన్నబోవాల్సి వస్తున్నది. కాంగ్రెస్ నేతల అత్యుత్సాహంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం అసంతృప్తితోనే ఉన్నారు. సోమవారం తన తల్లి ప్రథమ వర్ధంతి ఉండటంతో బాల్కొండలో జరిగిన జూపల్లి కార్యక్రమానికి హాజరు కాలేదు. మోర్తాడ్, భీమ్‌గల్‌లో ముత్యాల సునీల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తీరుపై ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి.