రుద్రూర్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ( Chairman Rajireddy ) బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని( Library) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకులకు అన్ని విధాల సౌకర్యాలను కల్పించాలని సిబ్బందికి సూచించారు. గ్రామస్తుల కోరిక మేరకు పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగుల కోసం గ్రంథాలయం లో అన్ని ఏర్పాట్లు చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని కూలర్ పెట్టిస్తానని తెలిపారు.
నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో పాఠకులకు వేరు, నిరుద్యోగులకు వేరుగా సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. గ్రంథాలయ నిర్వహణలో కావల్సిన సౌకర్యాల గురించి తనను సంప్రదించాలని అన్నారు. రాయకూరు క్యాంప్‌లో గ్రంథాలయం నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయం తెరవకుండానే బిల్లు లు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
రుద్రూర్ గ్రంథాలయంలో నిరుద్యోగుల కోసం రోజంతా గ్రంథాలాయాన్ని తెరిచి ఉంచాలని గ్రంథాలయ పాలకులకు సూచించారు. ఈ సందర్భంగా తొలిసారి గ్రంథాలయానికి వచ్చిన జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డిని గ్రంథాలయ సిబ్బంది, గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకుడు శ్రీనివాస్, శివరాజ్, నిస్సార్, కార్తీక్, సాయన్న, లింగం తదితరులు ఉన్నారు.