బాన్సువాడ, అక్టోబర్ 31: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయబ్ తహసీల్దార్ క్రాంతి కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు మాట్లాడుతూ.. ప్రభుత్వ గ్రీన్ చానల్ ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లిస్తామని చెప్పి మూడు నెలలు అవుతున్నా, ఇంతవరకూ అమలుచేయడంలేదని మండిపడ్డారు. జిల్లాలో ఇప్పటికే రూ. 8 కోట్లు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
కార్మికులపై మోయలేని భారం వేస్తున్నారని, ప్రతిరోజూ కోడిగుడ్డు అందించాలని, రెండు కూరలు చేయాలని, గ్యాస్‌పై వండాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకుండా వంటలు చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తున్నదని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కార్మికులకు రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, ఇంత వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే గ్రీన్ చానల్‌ను అమలు చేసి, నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో నవంబర్ 12న చలో కమిషనరేట్ చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాల్‌రాజ్, స్వరూప, మంద శంకర్, పత్తి శ్రీనివాస్ , అనూషాబాయి, హన్మవ్వ, సరిత, లావణ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.