ఖలీల్‌వాడి, ఏప్రిల్ 11: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో అత్యాధునిక వైద్యం అందని ద్రాక్షగా మారింది. రూ.8 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్ ప్రారంభానికి నోచుకోకుండా మూలన పడింది. రోగుల సౌకర్యార్థం కేసీఆర్ ప్రభుత్వం ఈ అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. రూ.8 కోట్లు వెచ్చించి మెషినరీ సహా ఇతర వసతులు కల్పించారు. అయితే, ప్రభుత్వం మారడంతో క్యాథ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి గ్రహణం పట్టింది. అన్ని వసతులు ఉన్నా అత్యాధునిక సేవలు అందుబాటులోకి రాకపోవడంతో రోగులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సిన దుస్థితి తలెత్తింది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారిన జీవన ప్రమాణాల కారణంగా హృదయ సంబంధిత సమస్యలు తీవ్రంగా పెరిగి పోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల బారిన పడిన పేదలకు సకాలంలో ఉచితంగా అధునాతన వైద్య సేవలందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయించింది. అందులో భాగంగానే అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జీజీహెచ్‌కు ఖరీదైన, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రూ.8 కోట్ల విలువైన క్యాథ్‌ల్యాబ్ యంత్రాన్ని అందజేశారు. గుండె జబ్బు వచ్చిన వ్యక్తి పరిస్థితిని అంచనా వేసేందుకు తీవ్రతను బట్టి సరైన వైద్య సేవలందించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుంది.
గుండె పరీక్షల కోసం ప్రత్యేక గదిని కేటాయించడంతో పాటు గుండె ఆపరేషన్ అనంతరం రోగిని పరిశీలనలో ఉంచేందుకు కొన్ని పడకలతో ప్రత్యేక వార్డును కూడా నిర్మించారు. అయితే, ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పరిస్థితి మారిపోయింది. అధునాతన ల్యాబ్ ప్రారంభానికి నోచుకోకుండా పోయింది. వైద్యులు, టెక్నీషియన్లు లేకపోవడం, ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి రాలేదు. రెండున్నరేండ్లుగా రూ.కోట్ల విలువ చేసే యంత్రాలు మూలన పడగా, రోగులు ప్రైవేట్ దవాఖానల్లో భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది
క్యాథ్‌ల్యాబ్ సేవలు అందించటానికి ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం. కార్డియాట్రిక్ డాక్టర్ లేకపోవడంతో దానిని మూసివేశాం. నోటిఫికేషన్ జారీ చేసినా డాక్టర్లు రాలేదు. లోకల్ వైద్యులు కూడా రావడం లేదు. ఈ విషయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటివరకు డాక్టర్ లేకపోవడంతో క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించలేదు. డాక్టర్‌ను నియమిస్తే వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– నాగమోహన్, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్
బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. సర్కారు తోడ్పాటుతో అరుదైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ జరిగాయి. ఖరీదైన యంత్రాలు, వైద్య నిపుణుల నియామకంతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో రోగులకు మెరుగైన సేవలు అందాయి. ఉచితంగా మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ జరిగాయి. అన్ని వసతులు కల్పించడంతో పేదలకు ఎంతో మేలు జరిగింది. అయితే, ప్రభుత్వం మారడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దవాఖానలో పని చేసే 22 మంది సీనియర్ డాక్టర్లు, ప్రొఫెసర్లు బదిలీ కాగా, రెండు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.