నిజామాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తించి అన్ని వర్గాలవారు భాగస్వాములై కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఈ మూడు అంశాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. స్వరాష్ట్రంలో మన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నామని చెప్పారు. కాళేశ్వరం, భీమా, నెట్టెంపాడు వంటి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించుకొని సాగునీటి గోసను దూరం చేసుకున్నట్లు వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వివిధ సంక్షేమ పథకాలతో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా దూసుకెళ్తుందన్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా 16లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. వీటితో పాటే విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నదని తెలిపారు. కేసీఆర్ కిట్ వంటి పథకాల ద్వారా సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని గుర్తుచేశారు. రాష్ట్రం నలువైపులా రూ. వందల కోట్లు ఖర్చుచేస్తూ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్నామని, పీహెచ్‌సీల్లోనూ వెంటిలేటర్ల సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇదే తరహా ప్రభుత్వ బడులను కూడా మరింత బలోపేతం చేసి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన బడి పేరుతో మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. మౌలిక వసతులను మెరుగుపర్చి, ఆంగ్ల మాధ్యమంలో బోధనను అమల్లోకి తెస్తే అన్ని వర్గాల ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపిస్తారని అభిప్రాయపడ్డారు. దీంతో ప్రజలపై ఆర్థిక భారం తగ్గడంతోపాటు ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉన్నత స్థానాల్లో ఉన్నవారు విరాళాలు అందించి తాము చదువుకున్న సర్కారు బడుల అభ్యున్నతి కోసం సహకరించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాఠశాల యాజమాన్య కమిటీ, సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధపెట్టి పూర్వ విద్యార్థులు, ఇతర దాతల ద్వారా విరాళాలను సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తే విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26,672 పాఠశాలల్లో మన ఊరు-మన బడి అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.7289 కోట్లు వెచ్చించబోతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోద్దని అధికార యంత్రాగానికి సూచించారు. తొలి విడుతలో ఎవరి ప్రమేయం లేకుండానే విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని జిల్లాలోని 407 స్కూళ్లను ఎంపిక చేశామన్నారు. ఇందులో 65 శాతం అంటే 72,801 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. అవసరమైన చోట మరమ్మతులు, అదనపు తరగతి గదులు, ల్యాబోరేటరీ, లైబ్రరీ, ప్రహరీ, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ తరగతులకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. వీటి కోసం రూ.160 కోట్లు ఖర్చుచేయనున్నట్లు మంత్రి చెప్పారు.
మనఉరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారబోతున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. దాతలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు సహకరించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో అన్ని పనులను ప్రారంభించాలి. బడులను తనిఖీ చేస్తాం.
-అశన్నగారి జీవన్‌రెడ్డి, అర్మూర్ ఎమ్మెల్యే
పేద పిల్లల భవిష్యత్తు కోసం దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న మనఉరు-మనబడి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది. సీఎం కేసీఆర్ అమలుచేస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమమైనా సంచలనమే! ప్రభుత్వ బడులను పరిశీలించేందుకు వెళ్లినప్పుడల్లా అనేక వినతులు వస్తాయి. మనఉరు-మనబడితో సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయి.
-దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ చైర్మన్
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల కోసం సీఎం కేసీఆర్ సుమారు రూ.7వేల కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించడం సంతోషం. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే మూడేండ్లలో అన్ని పాఠశాలలు కార్పొరేట్స్థాయికి చేరుకుంటాయి.
– వీజీ గౌడ్, ఎమ్మెల్సీ
మనఉరు-మనబడి కార్యక్రమంతో రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో అద్భుతమైన మార్పులు రానున్నాయి. నేను చదువుకున్న మాక్లూర్ ప్రభుత్వ పాఠశాల పునర్నినిర్మాణం కోసం రూ.కోటి విరాళం అందజేశాం. ఇలాగే పూర్వ విద్యార్థులు ముందుకురావాలి.
-బిగాల గణేశ్‌గుప్తా, అర్బన్ ఎమ్మెల్యే
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి మెరుగైన బోధన అందించాలనే సంకల్పంతో మనఉరు-మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. దీనిద్వారా ప్రభుత్వ విద్య బలోపేతం కానుంది.
-నారాయణరెడ్డి, కలెక్టర్