Nizamabad | వినాయక్ నగర్, డిసెంబర్ 26 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మాయలేడీ తనకు అత్యంత సన్నితుడైన రైల్వే హెడ్ కానిస్టేబుల్ తో కలిసి జనాలకు టోకరా వేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపించి వారి వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఫేక్ ప్రభుత్వ ఉద్యోగాల తతంగం వెలుగులోకి రావడంతో హెడ్ కానిస్టేబుల్ సహాయంతో మాయలేడీకి డబ్బులు ముట్ట చెప్పిన బాధితులు తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
నిజామాబాద్ మూడో టౌన్ ఎస్సై హరిబాబు కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గొట్టే స్వరూప అనే మహిళ గత కొంతకాలం క్రితం నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ప్రాంతానికి వచ్చి నివాసముంటోంది. ఆమెకు పరిచయమున్న నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కుబేరుడు కలిసి నిరుద్యోగులైన యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పారు. ఆర్అండ్బీ డిపార్ట్మెంట్, జిల్లా పరిషత్ , ఎస్సీ కార్పొరేషన్లలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. దీంతో ఒక్కొక్కరు సుమారు రూ.రెండు లక్షల నుండి రూ.మూడు లక్షల వరకు సదరు లేడీకి డబ్బులు చెల్లించారు. అలా డబ్బులు చెల్లించిన వారికి సదరు కిలాడీ లేడీ సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ నియామక పత్రాలు, ఐడీ కార్డులను అందజేసింది.
దీంతో తమ వద్ద ఉన్న ఉద్యోగ నియామక పత్రాలను పరిశీలించిన యువత అవి నకిలీ పత్రాలను తేలడంతో తాము మోసపోయామని గ్రహించారు. అయితే నిజామాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కుబేరుడు సహకారంతోనే తాము ఆ లేడీకి డబ్బులు చెల్లించామని, అయితే తమకు తప్పుడు నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసినందుకు మధ్యవర్తిగా ఉన్న తానే డబ్బులు ఇప్పించాలని బాధితులు హెడ్ కానిస్టేబుల్ ను నిలదీశారు. అయితే అందుకు చాలా చేతికి డబ్బులు ఇవ్వలేదని, అందులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎవరికి డబ్బులు ఇచ్చారో వారిని అడుక్కోమని సదరు హెడ్ కానిస్టేబుల్ బాధితులకు తిరగబడడంతో వారు గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించారు.
దీంతో వారి మాటలను నమ్మిన పలువురు నిరుద్యోగులు చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వాసులు చేసి ఫేక్ ఐడీ కార్డు సృష్టించి ఫేక్ నియామక పత్రాలను చూయించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, పలువురు బాధితులు మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్వరూప అనే మహిళతో పాటు ఈమెకు సహకరించినటువంటి హెడ్ కానిస్టేబుల్ కుబేరుడు పై కేసులు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లుగా మూడో టౌన్ ఎస్సై హరిబాబు వెల్లడించారు.