Waqf Board, Bill | కంటేశ్వర్ ఏప్రిల్ 20 : వక్ఫ్‌బోర్డు చట్టంను సవరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని ముస్లిం మైనార్జీ సమాజాన్ని బలనహీన పరిచేలా కేంద్రం కుట్రపన్ను తోందని వక్ఫ్‌బోర్డు చట్టం సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ బిల్లును అమలు కానీయమని, చట్ట ప్రకారం కోర్టుల ద్వారా కచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో సొంత ఖర్చులతో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
వక్ఫబిల్ చట్టం చట్టబద్ధతపై సుప్రీం కోర్టులో విచారణ మొదలైందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ వివరణ కోరిందని తెలిపారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టిందన్నారు. తమ న్యాయవాదుల బృందం కోర్టులో వాదనలు వినిపించారని, ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారని అన్నారు.
చట్టం ప్రకారం’ అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని, ఈ పదబంధం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు. ఆస్తుల సర్వే బాధ్యత కలెక్టర్‌కు ఇచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గతంలో ముస్లింలు మాత్రమే వక్ఫ్ కౌన్సిల్, బోర్డులో భాగమని.. సవరణ తర్వాత హిందువులు కూడా భాగం కావొచ్చని.. ఇది పార్లమెంటరీ చట్టం ప్రాథమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని తప్పకుండా మాకు న్యాయం ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో భారీ మొత్తంలో ముస్లింలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.