నిజామాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సరిగ్గా 2019 సాధారణ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో రాజకీయవేడి రాజుకున్నది. తెలంగాణ రాష్ట్ర భూభాగాన్ని ఆనుకొని ఉన్న అనేక పల్లెటూర్లలో మరాఠా ప్రజలంతా పొరుగు రాష్ట్రంలో విలీనమవుతామంటూ నినదించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో దేశంలో గుర్తింపు పొందిన తెలంగాణలో తమకు తాముగా వచ్చి కలుస్తామంటూ మరాఠాలు చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడైనా పథకాలు కావాలంటే రోడ్డెక్కి ధర్నాలు చేస్తారు.. ప్రభుత్వాలను నిలదీస్తారు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలనే తమకు కావాలంటూ కోరడం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. నాడు మొదలైన ప్రజా ఆకాంక్ష రోజురోజుకూ పెరుగుతూ సరిహద్దులోని అనేక గ్రామాలకు పాకింది. నాందెడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని సుమారు 18 గ్రామాల్లో ఇప్పుడు ఈ చర్చ తీవ్రమవుతున్నది. తాజాగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేసిన ప్రకటన.. మరాఠాల్లో కాసింత ఆశలను చిగురింపజేసింది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే ఆదర్శవంతమైన పరిపాలన అందుతుందని పొరుగు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రజలు దక్కించుకుంటున్న ప్రభుత్వ ఫలాలను తాము కూడా స్వీకరించే అవకాశం ఉంటుందని సంతోషపడుతున్నారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు తెలంగాణ వేదికైంది. దయనీయమైన సాగు విధానాలతో మహారాష్ట్రలోని రైతులు కుదేలవుతున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో దళారీ వ్యవస్థ పోయింది. మరాఠాలో మాత్రం దళారులే పెత్తనం సాగిస్తున్నారు. పంట పొలాల వద్దకు వచ్చి బలవంతంగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వారు ఎంత రేటు చెబితే అంతే. రైతుకు స్వేచ్ఛ అన్నదే ఉండదు. ఇక సాగు నీటి సౌకర్యం అసలే లేదు. కామారెడ్డి, నిజామాబాద్ సరిహద్దు నుంచి లెండి నదిపై కడుతున్న ప్రాజెక్టు దశాబ్దాలుగా మూలుగుతున్నది. చిన్నపాటి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నాలుగు ప్రభుత్వాలు మారినప్పటికీ ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. లెండితో నాందెడ్ జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరందే వీలుంది. కానిక్కడ ఎవ్వరూ పట్టించుకోరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృథాగా పోతున్న గోదావరి నీటిని ఎదురెక్కించి బీడు భూములకు సాగునీటిని పారిస్తున్న సీఎం కేసీఆర్ గొప్పోడంటూ మరాఠా రైతులంతా కితాబునిస్తున్నారు.
నిజామాబాద్ నుంచి సాలూరా మీదుగా మహారాష్ట్రకు వెళ్లినా, కందకుర్తి మీదుగా బ్రిడ్జి దిగి కాలు పెట్టినా, మద్నూర్ నుంచి దెగ్లూర్‌కు ప్రయాణం చేసినా… నిమిషాల్లోనే రహదారుల దుస్థితి కండ్లకు కడుతుంది. తెలంగాణ సరిహద్దు వరకు నల్లతాచు మాదిరిగా తారు రోడ్డు మెరుపులు చిమ్మిస్తుంటే… మహారాష్ట్రలో మాత్రం గతుకుల రోడ్లు స్వాగతం పలుకుతాయి. భారీ గుంతలతో రోడ్లన్నీ దయనీయంగా ఉన్నాయి. గ్రామాల్లో పంచాయతీ రోడ్లు కూడా అత్యంత దుర్భరంగా నెలకొన్నాయి. అందుకే మరాఠా ప్రజలంతా ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణాన్ని ఎంచుకుంటున్నట్లుగా చెబుతున్నారు. గుంతల రోడ్లపై ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదంటారు. మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్దంలా కనిపిస్తుండడం విశేషం. మహారాష్ట్రలో తాలూకాను కలిపే రోడ్లు చిందరవందరగా పడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడిప్పుడు వేస్తున్న జాతీయ రహదారులు తప్ప మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ రోడ్లన్నీ ఘోరంగా ఉన్నాయి. ఇకపోతే నదులు, వాగులు, కాలువలపై నిర్మించే బ్రిడ్జిలు అంతంత మాత్రమే. వానకాలం వచ్చిందంటే మహారాష్ట్రలో సగానికి ఎక్కువ ప్రాంతాలకు రాకపోకలే నిలిచిపోతాయి. ఇందుకు వంతెన నిర్మాణాలు సరిగా అందుబాటులో లేకపోవడమే కారణం.
మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతమంతా కరువుతో అల్లాడుతున్నదే. ముఖ్యంగా నాందెడ్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పెట్టుబడులు స్థాపించి ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితులు చాలా తక్కువ. నాందెడ్, ధర్మాబాద్, దెగ్లూర్లాంటి పట్టణాల చుట్టూ చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నెలకొల్పడమే తప్ప భారీ పరిశ్రమల ఏర్పాటు అన్నది లేదు. తద్వారా ఇక్కడ నిరుద్యోగం భారీగా కనిపిస్తున్నది. చదువుకున్నా ఉద్యోగాలు రావనే భ్రమతో చాలామంది యువకులు కూలీలుగా మారుతున్నారు. పొట్ట కూటి కోసం తెలంగాణకే వచ్చి పొలం పనులు, ఇతరత్రా కర్మాగారాల్లో కూలీ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే దుస్థితి నెలకొన్నది. ఇంజినీరింగ్ చదువులకు సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లలు చాలా దూరం. వీరికి అంతగా నాణ్యమైన విద్య అందడం కష్టమే. డిగ్రీ చదువులకు సుదూర ప్రాంతాలకు వెళ్లలేక విద్యాభ్యాసాన్ని మధ్యలోనే మానేస్తున్నారు. యువతులకు పెండ్లిళ్లు చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకొనే దుస్థితి ఏర్పడింది.
మహారాష్ట్రలో వైద్యం చిన్నాభిన్నంగా ఉంటుంది. గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడే వారికి స్థానికంగా పీహెచ్‌సీలు ఉన్నప్పటికీ డాక్టర్లు ఉండరు. మందులు అందుబాటులో ఉండవు. పెద్ద దవాఖానకు పోతే అపరిశుభ్రంగా ఉంటుంది. తెలంగాణ సరిహద్దులోని మరాఠా ప్రజలంతా పెద్ద రోగాలొస్తే ధర్మాబాద్, నాందెడ్ దవాఖానలకే వెళ్తారు. అక్కడ వైద్య సేవలూ అంతంత మాత్రమే. గర్భిణులను సర్కారు దవాఖానల్లో పట్టించుకునే వారు లేరు. అదృష్టముంటే సహజ కాన్పు చేస్తారు. అది కూడా పైరవీలతోనే సాధ్యమని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణలో మాదిరి కేసీఆర్ కిట్, ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయితే రూ.12వేల నగదు ప్రోత్సాహం అందదు. సహజ ప్రసవాలకు పెద్దపీట అన్నది లేదు. చాలామంది నిజా మాబాద్, బోధన్, బాన్సువాడ ప్రభుత్వ దవాఖానలకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు.
తెలంగాణలో అన్నివర్గాలను ఆదుకునే పథకాలను సీఎం కేసీఆర్ డిజైన్ చేసి అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో బడుగు, బలహీనవర్గాలకు అందే ప్రయోజనం చాలా తక్కువ. రాయితీలు 30 నుంచి 40 శాతం వరకు ఉంటే అదే పెద్ద పథకంగా చెప్పుకుంటున్నారు. ఇందులో లబ్ధిదారుడి వాటానే అధికంగా ఉంటుంది. తెలంగాణలో లబ్ధిదారులకు మంజూరయ్యే అనేక పథకాల్లో వందశాతం రాయితీ ఉన్నవే. ఇక బాల్య వివాహాలనే సామాజిక రుగ్మతలను తొలగించేందుకు కేసీఆర్ తీసుకువచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు మహారాష్ట్రలో మచ్చుకు కనిపించవు. ఇలాంటి పథకాలు తమకు అమలు చేస్తే బాగుంటుందనే అనే అభిప్రాయం మరాఠా ప్రజల్లో ఏర్పడింది. తెలంగాణలో ఆడబిడ్డ కుటుంబీకులకు రూ.లక్షా 116 నేరుగా అందుతుండడం గొప్ప విషయమని వారంటున్నారు. ఇక రెవెన్యూ సంస్కరణలో తెలంగాణలో భూ మార్పిడి అన్నది పారదర్శకంగా జరుగుతున్నది. మహారాష్ట్రలో నిజాం కాలం నాటి రికార్డులతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. పాత పద్ధతిలో జరుగుతున్న క్రయ, విక్రయాలతో గందరగోళం ఏర్పడింది.
తెలంగాణలో పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలను కేసీఆర్ కల్పించారు. కేంద్ర ఫైనాన్స్ నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వమూ నిధులిస్తున్నది. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే మహారాష్ట్రలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం విలయ తాండవం చేస్తున్నది. మోరీల్లో పారే మురికి..కాలనీల్లోనే తచ్చాడుతుంది. మురుగునీటి శుద్ధి అన్నది కనిపించదు. మొక్కల పెంపకం లేదు. పర్యావరణహిత కార్యక్రమాలు లేవు. గ్రామాలు వెలవెల కనిపిస్తాయే తప్ప తళుక్కుమనేలా అభివృద్ధి జరిగిన దాఖలాలే లేవు. కాలనీల్లో అక్కడక్కడ సీసీ రోడ్లు మినహాయిస్తే తాగునీటి సౌకర్యం కల్లా. మనకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు వస్తున్నది. మహారాష్ట్రలో తాగునీటి కటకట తీవ్రం. ఎండాకాలంలో మైళ్ల దూరం నడిచి మహిళలు నీళ్లు తెచ్చుకోవడమే. భౌగోళికంగా ధర్మాబాద్ తాలూకా ఏరియా మొత్తం దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్నది. భూగర్భ జలం కూడా అంతంత మాత్రమే ఉండడంతో తాగునీటికి గృహిణులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పంచాయతీల ద్వారా సాగే పరిపాలన చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. ఏడాది క్రితమే కొలువుదీరిన పాలకవర్గాలకు సర్కారు నుంచి వచ్చే నిధులు శూన్యం. సర్పంచులకు జీతాలు కూడా సరిగా మంజూరు కావంటే అతిశయోక్తి కాదు.
కేసీఆర్‌లాంటి గొప్ప నాయకుడిని మేము ఎన్నడూ చూడలేదు. మా పక్కనే బోధన్ నియోజకవర్గం ఉంటుంది. అక్కడ జరిగే అభివృద్ధి, రైతులకు ఇస్తున్న పెట్టుబడి సహాయం, రైతుబీమా పథకం, 24 గంటల ఉచిత కరెంట్ గురించి మా గ్రామాల్లోని ప్రజలు, రైతులు చర్చించుకుంటుంటాం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ కూడా అమలు చేయాలని అనేకసార్లు మా మంత్రులను కోరాం. లేకపోతే మా గ్రామాలను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేశాం. కేసీఆర్ ప్రధాని అయితే, తెలంగాణ మాదిరిగానే దేశంలో అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ ప్రధాని అయ్యేందుకు మా పూర్తి మద్దతు ఉంటుంది.
-రాజు పటేల్ షిండే, భ్రష్టాచార్ నిర్మూలన్ సంఘటన్ రాష్ట్ర కార్యదర్శి, చింపాలం, బిలోలి తాలూకా
నాకు 25ఎకరాల సాగు భూమి ఉంది. వానకాలం వస్తేనే పంటలు సాగు చేస్తాం. యాసంగిలో పంటలు సాగు చేయాలంటే ధైర్యం సరిపోదు. పెట్టుబడి కూడా రాదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదు. రైతులకు బీమా లేదు. మేము వ్యక్తిగతంగా కట్టుకున్నదే తప్ప ప్రభుత్వం కట్టే బీమా ఇంత వరకు చూడలేదు. తెలంగాణ రైతులకు కేసీఆర్ చాలా మంచి పని చేస్తుండు. మాక్కూడా అమలు చేస్తే బాగుంటుంది. కేసీఆర్ లాంటోళ్లు దేశానికి నాయకత్వం వహించాలి.
– నారాయణ్ పటేల్, రైతు, మహారాష్ట్ర
తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు. సీఎం కేసీఆర్ ప్రజలకు చాలా మంచి పనులు చేస్తున్నారు. రైతులకు, పేదోళ్లకు అమలవుతున్న పథకాలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. మాక్కూడ అలాంటి పథకాలు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అందుకే తెలంగాణలో కలవాలని ఆశిస్తున్నాము. మా దగ్గర ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మార్పు కనిపించడం లేదు. మా చుట్టాలు చాలా మంది తెలంగాణలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి వారికి వచ్చే ప్రయోజనాలపై చాలా విషయాలు చెబుతుంటారు.
– రేనివార్ గంగాధర్, రైతు, మహారాష్ట్ర
కేసీఆర్‌లాంటి నాయకుడు ప్రధానిగా ఉంటే చాలా మంచిది. అన్నుకున్నది సాధించే గుణం కేసీఆర్‌కు ఉంది. మాకు చాలా దగ్గర్లోనే బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లోని అనేక గ్రామాలు ఉన్నాయి. అక్కడి ప్రజలతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్, శరద్‌పవార్‌లాంటి నాయకులు ఈ దేశానికి చాలా అవసరం. దేశాన్ని పాలించే సత్తా ఉన్న కేసీఆర్ ప్రధాని అయితే, తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇక్కడ కూడా అమలవుతాయని అనుకుంటున్నాం.
-వెంకట్రావు పాండవే,పంచాయతీ సమితి మాజీ సభాపతి, బిలోలి
తెలంగాణల ముసలోళ్లకు, కుంటోళ్లకు, దిక్కులేనోళ్లకు పింఛన్లు ఇస్తుండ్రు. మా బాజుకు ఉన్న ఊళ్లల చుట్టాల ఇండ్లకు పోయినప్పుడు. అక్కడ నా వయసోళ్లంతా నెల నెలా పింఛన్లు తీసుకొని సంతోషమవుడు చూసిన. రైతులకు కూడా పంటలు పండించేందుకు కేసీఆర్ సార్ పైసలు ఇస్తున్నడు. మా మహారాష్ట్ర సర్కార్‌లో నా అసుంటోళ్లకు పింఛన్లు రాకచ్చినయ్. కేసీఆర్‌లాంటి నాయకుడు మాకు ఉంటే మా అసొంటి గరీబోళ్లుకు ఏ గోసా ఉండేది కాదు. దేశానికి కేసీఆర్ సార్ పెద్ద అయితే, గంతకన్నా మాకు సంతోషం ఏముంటది. కేసీఆర్ సల్లంగా ఉండాలి.. దేశానికి ప్రధాని కావాలె..
– రాజూబాయి, బిలోలి, మహారాష్ట్ర
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నది. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నారు. ఇక్కడ అవేవీ లేవు. 24 గంటల కరెంట్ లేదు. రైతుల వడ్లను అక్కడి ప్రభుత్వం ప్రతి ఊరిలో కొనుగోలు చేసి, వెంటనే బిల్లులు ఇస్తున్నది. ఇక్కడ ప్రభుత్వం వడ్లు కొనాలంటే.. రెండు నెలల ముందే ఆన్లైన్ చేయాలి. అలాగే, వడ్లు అమ్మిన తర్వాత బిల్లు కోసం రెండు నెలలు కావాలి. అందుకే ఇక్కడి రైతులు, ప్రజలు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో కలిస్తే తప్ప మా సమస్యలు పరిష్కారానికి నోచుకోవు.
-రాజేంద్ర సోమశంకర్ పాటిల్, మాజీ సర్పంచ్, కార్ల