కామారెడ్డి, నవంబర్ 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వేరు, చేతలు వేరు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నందుకు నిరసనగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాదిగల ధర్మయుద్ధం మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందకృష్ణ హాజరై మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ దేశంలో ఎస్సీ వర్గీకరణ తాను మొదటగా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. వర్గీకరణ అమలుచేయకుండానే ఉద్యోగాల భర్తీకి సిద్ధపడుతున్నాడని మండిపడ్డారు. మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. వర్గీకరణ రద్దు చేయాలని తిరుగుతున్నది మాలలేనని, వారిని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు.
ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసినప్పుడు మాదిగలు అండగా నిలిచారని, నీతి, నిజాయితీ ఉంటే మాదిగలకు న్యా యం చేయాలన్నారు. 2004లో ఎస్సీ వర్గీకరణను 24 గంటల్లో రద్దు చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. 2024లో ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలని తీర్పు వచ్చినా ఇప్పటికీ అమలుచేయని ప్రభుత్వం కూడా కాంగ్రెస్ సర్కార్ అని తెలిపారు. దీన్నిబట్టి కాంగ్రెస్ ఎవరికి కొమ్ముకాస్తుందో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మన బిడ్డలు బాగుపడతారని అనుకున్నానని, కానీ కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.