కంఠేశ్వర్ ఏప్రిల్ 15 : పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్‌ను అవమానించింది బీజేపీ నాయకులే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్‌ను అవమానించిన బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని వారి పాపపు చేతులతో తాకినందుకు మంగళవారం మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నుంచి గ్రామ స్థాయి బీజేపీ కార్యకర్త వరకు అంబేద్కర్‌ను అవమానించారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ గురించి అవకులు చెవాకులు పేలితే ప్రధానిగా మోదీ మందలించలేదని విమర్శించారు. అంబేద్కర్ పేరు కంటే దేవుడి పేరును తలుచుకుంటే పుణ్యం వస్తుంది అని అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన తీరు దేశం మొత్తం చూసిందన్నారు.
అంబేద్కర్ సబ్బండ వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చారని, అందుకే దేవుడు లాంటి అంబేద్కర్ పేరును జపం చేస్తారు అని, ఆయన చేసిన సేవలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ప్రజలు ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు.
హంతకుడే సంతాపం తెలిపినట్టు..
హత్య చేసిన వారే సానుభూతి తెలిపినట్టు రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలు శుద్ధి చేశారని ఎద్దేవా చేశారు. బీపేపీ నాయకులకు సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. బీజేపీ అంబేద్కర్‌ను తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని తిప్పి కొడతాం అని, జై బాపు, జై భీం, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ముందుకు తీసుకెళ్తూ అంబేద్కర్ ఆశయాలను వివరిస్తామన్నారు. ఎందుకు మోదీ ప్రధానిగా అంబేద్కర్‌కు నివాళులు అర్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజా రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, విజయ్ పాల్ రెడ్డి, సుమన్, వినోద్ బోటి, సంగెం సాయిలు, కేశ మహేష్, సాయి కుమార్ పాల్గొన్నారు.