నిజామాబాద్, మే 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; హోరాహోరీగా కొనసాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. శనివారం సాయంత్రం 5గంటలకు అభ్యర్థుల ఓట్ల వేట ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు ఇక మైకులను బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువును దాటి ప్రచారం నిర్వహిస్తే ఈసీ నిబంధనల మేరకు శిక్షార్హులవుతారు. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నామినేషన్ల ముగింపు వరకు స్తబ్ధంగా జరిగిన ప్రచార కార్యక్రమాలు.. రెండు వారాలుగా ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అడుగడుగునా తనిఖీలతో అదరగొట్టిన ఎన్నికల యంత్రాంగం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. బృందాలు విస్తృతంగా తిరగపోవడంతోపాటు చెక్‌పోస్టులు కూడా ఎక్కువగా కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాతీయ రహదారులు, జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్ సమయం దగ్గర పడడంతో ఎన్నికల యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించింది.
ఎన్నికల రణరంగంలో ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి దూసుకుపోతూ కాంగ్రెస్, బీజేపీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. వారి మోసపూరిత హామీలను జనాలకు వివరించే ప్రయత్నం చేయడంలో విజయవంతమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేస్త్తున్న కుట్రలను బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టారు. మే 6, 7 తేదీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ బాస్ కేసీఆర్ నిర్వహించిన రోడ్‌షో, బస్సుయాత్రకు తండోపతండాలుగా తరలిరావడంతో బీఆర్ఎస్కు ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని స్పష్టమైంది. దీనికి తోడు కేసీఆర్ రెండు రోజుల టూర్ గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. నిజామాబాద్‌లో ఒకరోజు బస చేయడంతోపాటు నెహ్రూ పార్కులో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కామారెడ్డిలోని జేపీఎన్ రోడ్డులోనూ ఆయన స్పీచ్‌కు జనం ముగ్ధులయ్యారు. కేసీఆర్ టూర్ తర్వాత ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలు గులాబీ పార్టీ వైపే మళ్లినట్లుగా రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. గెలుపు బాటలో బీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతున్నట్లుగా పలు సర్వేలు సైతం తేటతెల్లం చేస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీలో గుబులు
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో పార్లమెంట్ ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో క్యాడర్ అసంతృప్తి ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. దీంతోపాటు రెండు ప్రభుత్వాలపై వ్యతిరేకత కనిపిస్తుండంతో ఆయా పార్టీల పెద్దలు అయోమయానికి గురవుతున్నారు. ప్రచార పర్వంలో స్పందన లేకపోవడం, అడుగడుగునా నిరసనలు, నిలదీతలతో జాతీయ పార్టీలకు నెత్తి పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, అభివృద్ధిపై హామీ లు ఇవ్వకపోవడం, ఇచ్చిన హామీల అమలుపై దాటవేత ధోరణితో జనం నుంచి తప్పించుకొని తిరిగాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ఒక్కటే ఆశాదీపంగా ప్రజలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతం తేడాతో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఈసారి భారీగా మద్దతు దక్కనుందని అంచనాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అర్వింద్‌కు తమ పార్టీ సపోర్టు చేసిందంటూ కాంగ్రెస్ నేతలు బాహాటంగానే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా, వారి కుమ్మక్కు రాజకీయాలను తేటతెల్లం చేస్తున్నాయి. 2024 లోనూ అదే రీతిలో ఏమైనా లోపాయికారి ఒప్పందాలు జరిగి ఉంటాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
మద్యం షాపులు బంద్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేటి (శనివారం) సాయంత్రం 5 నుంచి ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్బులు బంద్ పాటించాలని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా బంద్ పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 4న ఉదయం నుంచి 5వ తేదీ 6 గంటల వరకు బంద్ ఉంచాలని సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బంద్ పాటించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.