హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): జాగృతి అధ్యక్షురాలు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు కోర్టు తీర్పుతో అదే నిజమైందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అల్లిన కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియా, కవిత వంటి నాయకులపై మోపిన అక్రమ కేసులు కేవలం రాజకీయ కక్షతో కూడుకున్నవని కోర్టు తీర్పుల ద్వారా స్పష్టమవుతున్నదని తెలిపారు.
ట్రయల్ కోర్టు విచారణ చేయడానికి కూడా ఈ కేసులో సాక్ష్యాలు లేవని, మొదటి దశలోనే కేసును కొట్టివేయడం సంతోషకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయంగా బద్నామ్ చేయడమే ధ్యేయంగా, ఈ కేసులు పెట్టారని విమర్శించారు.
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులను ఇబ్బంది పెట్టాలని చూసిన శక్తులకు ఇది గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంతటి దుష్ప్రచారం చేసినా, చివరికి సత్యమే జయించింది అని చెప్పారు. ఇది భారత రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని పెంచే న్యాయ విజయమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని అభాసుపాలు చేయాలని చూసిన కుతంత్రాలన్నీ పటాపంచలయ్యాయని పేర్కొన్నారు.