కుల ఆధిపత్యం అనేది ఒక సామాజిక, మానసిక వ్యాధి. ఇది ఆధిపత్య వర్గాలలో అహంకారాన్ని, వివక్షను, బాధితులలో మానసిక ఆందోళనను, ఆత్మన్యూనతను కలిగిస్తుంది. ఆత్మహత్యలకు, దళిత విద్యార్థులపై వేధింపులకు, సామాజిక అసమానతలకు దారితీసే సజీవ సాక్ష్యం. కుల ఆధిపత్యం అనే రుగ్మత సమాజంలో ద్వేషాన్ని, అనైక్యతను పెంచుతుంది. కుల అహంకారం, ఆధిపత్యం అనే ధోరణి వల్ల కేవలం వంద రూపాయల కోసం ’అంటరాని జాతి’ అనే ముద్రతో ఓ రెండు నెలల పసికందును పొట్టన పెట్టుకున్న విషాద ఘటన నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగింది. ఈ ఘటన భారత సమాజపు అంతరాత్మను కుదిపేస్తున్నది.
ఆధునిక శాస్ర్తాలు, ఉపనిషత్తులు, సంస్కృతి, భక్తి సంప్రదాయాలు నేటి ప్రజానీకానికి ఆధునిక గురువులు. దేశంలోని ఏ దేవుడి ముందు అయినా అందరూ సమానమే అన్నారు. కానీ దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు, ఆయా పల్లెల్లోని కుటుంబాలు, పల్లె ప్రాంత నివాసుల మనసుల్లో మాత్రం ‘ఎవరిది ఎక్కువ జాతి… ఎవరిది తక్కువ జాతి’అనే అసమానతలు మాత్రం లేకపోలేదు. ఈ అసమానతలు కేవలం భావోగ్వేదమే కాదు. అది ఒక సామాజిక నిర్మాణం, ఓ ఆర్థిక వ్యవస్థ, ఓ రాజకీయ శక్తినిర్మాణం, ఓ సాంస్కృతిక నియంతృత్వం. అందుకే ఇలాంటి విషాద ఘటనలు మన వ్యవస్థలోని లోపాలను ప్రతిబింబిస్తాయి. అగ్రకుల అహంకారానికి బలైన బాధితులు కాళ్లపై పడి వేడుకున్నా కనికరం చూపక పసికందును చంపడం వ్యవస్థాగత హింసగా చెప్పొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది అణచివేతకు, వివక్షకు గురవుతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిప్పటికీ వందల ఏండ్ల నుంచి దళితులు, బహుజనులు అంటరాని మంటల్లో కాలుతూ, ఊరి పొలిమేరల్లోనే జీవనం సాగిస్తున్నారు. సమతా మమతలు అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దళితులు హింసకు గురవుతూనే ఉన్నారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః’ అన్నారు. ఎక్కడైతే స్త్రీలు పూజింప బడతారో, అక్కడ దేవతలు సంచరిస్తారని అర్థం. కానీ నేడు స్త్రీలు అనేక రకాల వివక్షలకు గురవుతున్నారు. ఇది పూర్తిగా అంతం అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
అణచివేతలు, అసమానతలను అధిగమిస్తూ… వెలివేసిన జీవితాల్లో విద్యతోనే వెలుగులు వికసిస్తాయని నమ్మి, కఠోర పరిస్థితులను అధిగమించి ఉన్నత విద్యలను అభ్యసించిన ప్రపంచ మేధావి, విశ్వవిజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పినట్టు ‘సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం శూన్యం’ అన్నట్టు మనకు రాజకీయ ప్రజాస్వామ్యం ఉన్నది కానీ, సామాజిక ప్రజాస్వామ్యం లేదనే భావన కలుగుతున్నది. దేవాలయాల ప్రవేశం, కుల ఆధారంగా భోజనాల ఏర్పాటు కొనసాగుతున్నంత కాలం మనది ఆధునిక సమాజం అని చెప్పుకోవడం ఓ భ్రమనే. కులహింసను చట్టంతో మాత్రమే నిర్మూలించలేం. చట్టం కేవలం శిక్షిస్తుంది కానీ చైతన్యం తీసుకు రాదు. విద్య, మీడియా, సాహిత్యం, రాజకీయాలు, మతం అన్ని కలిసి ఒక సమ సమాజ రాజకీయ విప్లవం రావాలి. ఇందుకు కుల భావజాలాన్ని ప్రశ్నించడమే మార్గం.