రాజన్న సిరిసిల్ల, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ మరో ఆద్భుతం సృష్టించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత నల్ల పరంధాములు స్ఫూర్తితో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణకోసం ప్రత్యేకంగా తయారుచేశారు. మంగళవారం ఇంద్రకీలాద్రిలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి, పట్టుచీరను ఈవో వీకే శీనానాయక్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా నల్ల విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో అపరేషన్ సిందూర్ పేరిట అద్భుతమైన శాలువాను తయారు చేసి ప్రధానమంత్రి మోదీకి అందించి ప్రశంసలు పొందినట్లు పేర్కొనానరు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ నల్ల విజయ్ చేనేత కళానైపుణ్యాన్ని ప్రశంసించారు. చేనేత కళాకారులను, సంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు.
అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర ప్రత్యేకతలు
కనకదుర్గ అమ్మవారి కోసం నల్ల విజయ్ వారంపాటు శ్రమించి పట్టు చీరను మగ్గంపై నేశాడు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఉన్నప్పటికీ, దీని బరువు 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. సంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇకత్ డిజైన్’ వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించారు. గతంలోనూ అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బడం, ఉంగరంలో దూరే చీరలు, క్యూఆర్ కోడ్‌తో కూడిన వస్ర్తాలను నేసి విజయ్ అద్భుతం సృష్టించారు.