బడ్జెట్లో భారీగా నిధుల కోత మూడేండ్లుగా ఇదే తీరు 2022-23లో తగ్గిన పని దినాలు కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతే ఉమ్మడి జిల్లాలో దిగ్విజయంగా అమలవుతున్న పథకం గ్రామీణ నిరుపేదలకు కొండంత అండగా ఎన్ఆర్ఈజీఎస్ కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పేదలపై కక్ష గట్టింది. గ్రామీణ ప్రాంత ప్రజల ‘ఉపాధి’కి ఎసరు పెట్టింది. పల్లెలకు దన్నుగా నిలుస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎన్ఆర్ఈజీఎస్) పథకాన్ని మోదీ సర్కారు ప్రణాళికాబద్ధంగా నిర్వీర్యం చేస్తున్నది. మూడేండ్లుగా వార్షిక బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ అత్తెసరు నిధులను కేటాయించింది. నిరుడు రూ.4 వేల కోట్లకు పైగా రాష్ర్టానికి ఉపాధి నిధులు ఇచ్చిన కేంద్రం.. ఈసారి దాదాపు సగం తగ్గించింది. బీజేపీ ప్రభుత్వ చర్యలతో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని కూలీలకు పనులు దొరకడం లేదు. ‘ఉపాధి’ దూరమై కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– నిజామాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామీణ ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి, చేతినిండా పని, ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తున్నది. పథకం అమలుకు జాతీయ స్థాయిలో నిధుల కేటాయింపుల్లో తీవ్రమైన నిర్లక్ష్యం మూలంగా పని దినాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఉపాధి లేక గ్రామీణ జనమంతా నిరుత్సాహానికి గురవుతున్నారు. వాస్తవానికి ఈ పథకం అమలులో కేంద్రం వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా నిధులను వెచ్చిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తనవంతు వాటా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం తమ బాధ్యత నుంచి క్రమంగా వైదొలగుతున్నది. పేదల కడుపు కొడుతూ మోదీ సర్కారు అవలంబిస్తోన్న విధానంపై ఇంటా బయటా తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఉసురు తీస్తోన్న మోదీ..
ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ఉపాధి హామీ పథకానికి భారీ డిమాండ్ ఉంటుంది. అయితే, కేంద్ర నిర్వాకంతో పేదలకు ‘ఉపాధి’ దూరమవుతున్నది. పనుల సంఖ్యను కుదించడం, నిధుల విడుదలలో జాప్యం, కొర్రీలు పెట్టడం వంటి కారణాలు, సాంకేతికపరమైన అంశాలతో చిక్కుముడులను కల్పించడం ద్వారా ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2021-22 లెక్కల ప్రకారం 2లక్షల 76వేల 340 జాబ్ కార్డులకు 5లక్షల 62వేల 199 మంది కూలీలు నమోదు కాగా ఇందులో నిత్యం పనికి వచ్చే వారు 3లక్షల 1వేయి 418 మంది ఉన్నారు. 2021-22లో కూలీలకు వెచ్చించిన మొత్తం రూ.145 కోట్లు కాగా, 2022-23లో రూ.77.25 కోట్లుగానే ఉంది. ఇక, గతేడాదిలో 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాలు 15,170 ఉండగా, 2022-23లో ఇప్పటి వరకు 493 మంది మాత్రమే ఉండడం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన చర్యలను ప్రస్ఫుటం చేస్తోంది. సరాసరి పనిదినాల పరంగా చూసినా 2021-22లో 47.32 ఉండగా 2022-23లో 28.16 పడి పోయింది.
పెంచమంటే తగ్గించారు..
ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోనే ఉంది. పనులకు భారీగా డిమాండ్ ఉండడంతో నిధులు పెంచాలని కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని కోరింది. తెలంగాణ విజ్ఞప్తిని పట్టించుకోని మోదీ సర్కారు కేటాయింపులను పెంచగా పోగా, మరింతగా తగ్గించింది. తద్వారా రాష్ట్రంపై మరోమారు వివక్షను చాటుకుంది. నిధులు తగ్గించడంతో ఉపాధి లభించడం గగనంగా మారనుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉపాధి పనులకు ఫుల్లుగా డిమాండ్ ఉంది. అయితే, కేంద్రం వరుసగా ‘ఉపాధి’ నిధులకు కత్తెర వేయడంతో కూలీలకు చేతినిండా పని దొరకడం లేదు.
పేదోడిపై దెబ్బ..
ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే 17ఏళ్లు పూర్తయ్యింది. పేదలందరినీ ప్రణాళికాబద్ధంగా ప్రగతి మెట్లు ఎక్కించడం సాధ్యం కాని పరిస్థితిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజల ఆకలి మంటలనైనా చల్లార్చాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధికి తగిన పనులను ఎంచుకుని వేతనదారులకు పని కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తూ పేదరిక సమస్యకు ఒక పరిష్కారం చూపడం ప్రధాన లక్ష్యం. గ్రామీణ భారతంలో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకాన్ని మోదీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. దేశ వ్యాప్తంగా ఈ పథకానికి ప్రణాళికబద్ధంగా ముగింపు పలికేందుకు కంకణం కట్టుకుని మరీ పని చేస్తోంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలే కాకుండా ఈ పథకం ద్వారా గ్రామీణ అభివృద్ధి సైతం సాధ్యమవుతోంది. ప్రపంచ వేదికలపైనా ఈ పథకం గొప్పతనం వెల్లివిరిసిన సందర్భాలు సైతం ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ‘గ్రామీణ ఉపాధి’ కి మకిలి అంటుకున్నట్లు అయ్యింది.
ఇంతకు మునుపు ఇట్ల లేకుండె..
నేను ఏడేండ ్ల సంది ఉపాధి పనులకు పోతున్న. కరువు, కాటకాల్లోనూ ఈ పథకం ద్వారా వంద రోజుల పని దొరుకుతుండె. ఏడాదిన్నర సంది పనులకు పిలుచుడు లేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోతున్నం. ఇంతకు మునుపు ఉన్నట్లు పని ఉంటలేదు. పని దినాలు చాలా తగ్గించారు.
– బి.అనిల్, తాడెం, మోపాల్ మండలం
ఉపాధి పనులు సరిగా జరుగతలేవు..
తొమ్మిదేండ్ల సంది మా కుటుంబమంతా ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నాం. రోజువారీ కూలీ 210 నుంచి 220 వరకు తీసుకునేటోళ్లం. వంద రోజులు తప్పకుండా పని దొరికేది. ఇప్పుడైతే ఉపాధి హామీ పనులు సరిగా జరగడం లేదు.
– అయిటి గాంధీ, తాడెం, మోపాల్ మండలం