ఇల్లెందు, ఫిబ్రవరి 10 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల విశ్వాసం పెంచాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. ఇల్లెందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఔషధాల పంపిణీ విభాగం, రక్త పరీక్ష కేంద్రం, ఇన్ పేషెంట్ వార్డులు, గర్భిణీల వార్డు, గైనిక్ వార్డు, ఎక్స్‌రే గది, స్టోర్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఉన్న సదుపాయాలు, నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు సేకరించారు.

నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల విశ్వాసం పెంచాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
ఆస్పత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్త్ వెయిటింగ్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్ మిగిలిన పనులను వేగవంతం చేసి తక్షణమే ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల మేడారం జాతర ముగిసిన నేపథ్యంలో జాతర అనంతరం ఇన్ఫెక్షన్లు, జ్వరాలు వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటించాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహిస్తూ అవసరమైన మందుల నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల విశ్వాసం పెంచాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు సేవలకు సిద్ధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆస్పత్రికి అవసరమైన వైద్య సామాగ్రి, మరమ్మతులు, పరికరాల రిన్యూవల్కు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్, ఆర్ఎంఓ రామ్ నివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ జయ, హెడ్ నర్స్ ఫర్ జానా, నర్సులు భవాని, భారతి, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.