నిజామాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏర్పడిన వంట గ్యాస్ సంక్షోభాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బులకు ఆశ పడి అందిన కాడికి దోచుకుంటున్నారు. స్టాక్ ఉన్నప్పటికీ తాజా పరిస్థితిని బూచీగా చూపుతూ ఇష్టానుసాంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా ఎల్పీజీ గ్యాస్ లభ్యత రోజురోజుకు పడి పోతోంది. ఇదే అదునుగా పెరిగిన ధరలతో పాటుగా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెండు రోజుల క్రితం బుకింగ్ చేసుకున్న వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకు నాలుగైదు రోజులు సమయం తీసుకుంటున్నారు. బుకింగ్ ఆప్షన్‌ను సాంకేతికంగా నిలుపుదల చేయడంతో ఇంట్లో వంట గ్యాస్ అవసరం ఉన్న వారికి తలనొప్పి తప్పడం లేదు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద కనెక్షన్ బుక్ పట్టుకుని పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. నగదు రూపంలోనే బుకింగ్‌కు డబ్బులు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్లో చెల్లింపులు పూర్తిగా నిలిపేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకానికి సామాన్య జనం విలవిల్లాడుతున్నారు. కోట్లాది మంది అవసరాల రీత్యా ముందు చూపుతో వ్యవహరించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వ మొద్దు నిద్రకు ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నిదర్శనంగా నిలుస్తోందని జనం తిట్ల దండకం అందుకుంటున్నారు.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటూ చమురు సంస్థలు ప్రకటనలు చేస్తున్నాయి. గ్యాస్ కనెక్షన్‌దారులకు స్వయంగా మెసేజ్‌లు సైతం పంపిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. అవసరానికి తగిన మొత్తంలో సిలిండర్ల సరఫరా ఉందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో కాసులకు కక్కుర్తి పడుతోన్న గ్యాస్ ఏజెన్సీలు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. కొరత ఉందంటూ ప్రచారం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఎల్పీజీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దోపిడీకి తెర లేపినప్పటికీ సంబంధిత ప్రభుత్వ విభాగాలు పట్టించుకోవడం లేదు. సిలిండర్ బుకింగ్ చేసేందుకు క్యాష్ మాత్రమే తీసుకుంటుండటం అనుమానాలకు తావిస్తోంది. వారం క్రితం వరకు ఎల్పీజీ సిలిండర్ ధర రూ.928.50 ఉండగా రూ.60 పెంపుదలతో రూ.988కి చేరింది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాన్ని బూచీగా చూపించి కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే సిలిండర్ ధరను పెంచడంతో సామాన్య కుటుంబాలు లబోదిబోమనాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూట గడిచేందుకు వంటింట్లో సిలిండర్ అత్యవసరం కావడంతో రూ.వేయి వెచ్చిస్తున్నప్పటికీ సిలిండర్లు ఇంటికి చేరడం లేదు. ఇంట్లో పొయ్యి వెలిగించడమే గగనమైంది. సిలిండర్ బుక్ చేసేందుకు కొరత పేరుతో రూ.50 నుంచి రూ.100 వరకు గ్యాస్ ఏజెన్సీలు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుకింగ్ చేసుకున్న తర్వాత ఇంటికి సిలిండర్ చేర్చేందుకు సైతం సతాయిస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉందంటూ తప్పించుకుంటుండడంతో అదనంగా డబ్బులు ఇచ్చిన వారికే సరఫరా చేస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాణిజ్య సిలిండర్ల సరఫరా భారీగా క్షీణించింది. చమురు సంస్థల నుంచి డిమాండ్‌కు సరిపడా రాకపోవడంతో హోటళ్లు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. వ్యాపారాలు బంద్ చేసుకుని మిన్నకుండిపోతున్నారు. హోటళ్లు మూత పడటంతో ఉపాధి దెబ్బతిని కార్మికులు విలవిల్లాడుతున్నారు. మరోవైపు వివాహాల సీజన్ కావడంతో వాణిజ్య సిలిండర్ల కొరత ప్రభావం సెగలు పుట్టిస్తోంది. కట్టెల వంటపైనే వివాహాల్లో భోజనాలు రెడీ చేస్తున్నారు. ఒక్కసారిగా కట్టెలకు డిమాండ్ పెరుగుతుండటంతో వాటి ధరలు సైతం పెరిగినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఫల్యంపై సామాన్య జనం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించే వ్యూహాలు రచించకపోవడంపై మోడీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని ఎల్పీజీ ధరలు అమాంతం రూ.60 పెంచినట్లే సరఫరాను డిమాండ్‌కు తగినట్లుగా అందించకపోవడం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. సింగిల్ కనెక్షన్ కలిగిన కుటుంబాల్లో సిలిండర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కిరాయి ఇంట్లో జీవనం సాగించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కట్టె పొయ్యి వెలిగించకలేక, కరెంట్ స్టవ్‌లను కొనుగోలు చేయలేక సతమతం అవుతున్నారు.