పేదోడి నెత్తిపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ధరల పిడుగును వేసింది. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్’ అంటూనే సామాన్య ప్రజానీకాన్ని ధరల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నది. పలు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండడంతో కొన్ని నెలలపాటు ధరల పెంపు ఊసెత్తని కేంద్ర సర్కారు… ఒక్కసారిగా సామాన్యుడిపై విరుచుకుపడింది. ఏకంగా 50రూపాయలు పెంచి.. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. వెయ్యి దాటించింది. మరోవైపు పెట్రోల్‌పై రూ.1.23, డీజిల్‌పై రూ.1.17 చొప్పున పెంచడంతో దాని ప్రభావం నిత్యావసర ధరలపై పడనున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపే వంటగ్యాస్, ఇంధన ధరలను చీటికిమాటికి పెంచుతూ బీజేపీ సర్కారు జనాల నడ్డి విరుస్తున్నది. ఒకప్పుడు నెలకో, ఆరు నెలలకో ధరల్లో సవరణలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంధన సంస్థలు పూటపూటకూ ధరలు పెంచుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. అడ్డూఅదుపూ లేని ధరలతో తమను హింసించడం ఏమిటని మధ్యతరగతి జీవులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సబ్కా సాత్… సబ్కా వికాస్… అంటూ అడుగడుగునా నినదించే ప్రధాని నరేంద్ర మోదీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దేశంలోని ప్రజలందరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపే వంటగ్యాస్, ఇంధన ధరలను చీటికి మాటికి పెంచుతూ జనాల నడ్డి విరుస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డుస్థాయిలో రూ.వంద దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు నెల కో, ఆరు నెలలకో ధరల్లో సవరణలు కనిపించేది. కానిప్పుడు ఇంధన సంస్థలు పూటపూటకూ ధరల పెంపుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వంట గ్యాస్ రాయితీని భారీగా తగ్గించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 14.2 కేజీల గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను రూ.వేయి దాటించింది. దీంతో వంట గ్యాస్‌పై వంటలు చేసుకోవాలంటే ఆడవాళ్లకు కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. వాహనం తీసి ఎక్కడికైనా వెళ్లాలంటే పెరిగిన ఇంధన ధరలతో కుదేలు కావాల్సిన దుస్థితి దాపురించింది. నిత్యం ఏదో ఒక కారణాన్ని బూచీగా చూపి ధరల పెంపుతో ప్రజలను హింసించడం ఏంటంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా సబ్కా సాత్.. సబ్కా వికాస్ అంటూ నిలదీస్తున్నారు. ఇంటింటా ధరల మంటతో చిన్న, మధ్యతరహా కుటుంబాలు ఏకంగా సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
-నిజామాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అంతర్జాతీయ మార్కెట్ పేరుతో దేశంలో ఇంధన ధరలను మోదీ సర్కారు ఇష్టానుసారంగా పెంచేస్తోంది. వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులో ఉన్న సమయంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయికి తీసుకెళ్లింది. దేశంలో ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయబోతుందన్న సంకేతాలు రావడంతో కేంద్ర సర్కారు కుటిల నీతికి పాల్పడింది. తీవ్రంగా ధరలను పెంచేసిన కేంద్ర ప్రభుత్వమే ఎన్నికలతో పెంపుదలకు కాసింత బ్రేక్ ఇచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పక్కా రాజకీయాలకు పాల్పడింది. మార్చి రెండో వారంతో ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగియడంతో తన నిజ స్వరూపాన్ని బీజేపీ మరోమారు బయట పెట్టుకున్నది. ప్రజలను ధరల రూపంలో హింసించేందుకు తెర లేపింది. ఇలా ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సహా పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్రస్థాయిలో ధరలను పెంచేసి ప్రజలను పీల్చి పిప్పి చేస్తుండడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
వంటగ్యాస్ ధర మరోమారు భారీగా పెరిగింది. ఏకంగా రూ.50 పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న నిర్ణ యం సామాన్యులపై మోయలేని భారం వేసింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో వినియోగదారులపై ప్రతి నెల రూ.కోట్లలో భారం పడబోతున్నది. సవరించిన నూతన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఎల్పీ జీ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేస్తోంది. ప్రతి నెలా రూ.25 నుంచి రూ.100 వరకు పెంచుతూ పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరుస్తున్నది. 2020 నవంబర్‌లో రూ. 670 ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర డిసెంబర్లో రూ.100 పెరిగింది. అప్పుడు ప్రారంభమైన ధరల పెరుగుదల ఏడాది కాలంగా పరుగులు తీస్తూనే ఉంది. 2021 ఫిబ్రవరిలో రూ.75, మార్చిలో రూ.50 పెంచారు. ఏప్రిల్‌లో కంటితుడుపు చర్యగా రూ.10 తగ్గించారు. తిరిగి జూలైలో రూ.25.50, ఆగస్టులో రూ.25, సెప్టెంబర్‌లో రూ.25 పెంచగా అక్టోబర్‌లో మరింతగా ధరలను పెంచి రూ.975.50కు చేర్చారు. తాజాగా రూ.50 పెంచడంతో ప్రస్తుతం అన్ని చమురు సంస్థలకు చెందిన 14.2 కేజీల సామర్థ్యం గల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1025కు చేరింది.
నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌తో పోలిస్తే నిజామాబాద్‌లో రవాణా చార్జీలు కలుపుకొని మరింతగా భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా లీటర్ పెట్రోల్‌పై రూ.1.23, డీజిల్‌పై రూ.1.17 పెంచింది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి మార్కె ట్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.32, డీజిల్ ధర రూ.97.55కు చేరింది. నిన్నా మొన్నటి వరకు పెట్రోల్ రూ.110.09, డీజిల్ రూ.96.38 వరకు విక్రయించారు. తాజాగా పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించడంతో 24 గంటలు తిరగకముందే ప్రజలపై ఇంధన భారం షురూ అయ్యింది. కరోనా మిగిల్చిన సంక్షోభంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపారాలు, వాణిజ్య కార్యక్రమాలు సరిగా నడవక చతికిల పడిన కుటుంబాలకు ఈ పెంపుతో కుంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన ధరల మూలంగా బహిరంగ మా ర్కెట్లో నిత్యావసరాలు, కూరగాయలు, పాల ధరలు విపరీతంగా పెరిగేందుకు ఆ స్కారం ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పన్నుల భారం వేస్తున్నప్పటికీ పరోక్షంగా ఇతరత్రా ధరల్లో మార్పుల మూలంగా చిరుద్యోగాలు చేసుకుని బతుకిడ్చే వారంతా ఆగమాగం కావాల్సి వస్తున్నది.
కేంద్రం రోజురోజుకూ పెంచుతున్న పెట్రోల్ ధరలతో ఆటో నడపడం నరకంగా మారింది. ఇరవై ఏండ్ల నుంచి ఆటో నడుపుకొంటూ బతుకుతున్నా. ఒకప్పుడు ఆటో నడుపుతూ బతకడమంటే ఎంతో హుం దాగా ఉండేది. ఇప్పుడు అది భారంగా మారింది. ఆటోపైన సంపాదిం చి బాగుపడతామన్న భరోసా పోయింది. భార్యాపిల్లల కడుపు నింపుతున్నా అంతే.
-కొర్రి నాగేశ్ యాదవ్, ఆటో డైవర్, బీర్కూర్
అన్నింటి ధరలను పెంచడమే బీజేపీ పనిగా పెట్టుకున్నది. వంట నూనెల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి వాళ్లు వంట చేసుకుని తినే అవకాశం లేకుండా చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కేంద్రం భయపడి ధరలు పెంచడం విడ్డూరంగా ఉన్నది. పేదల ఓట్లతో గెలిచి, వారికే కర్రు కాల్చి వాత పెడుతున్నది.
-కొట్టూరి శోభారాణి, మాజీ ఎంపీటీసీ, బీర్కూర్
ఎవుసం చేసుకొని బతికేటోళ్లం. కేంద్రం డీజిల్ ధరలు పెంచుట్ల సంపాదించిన పైసల్లో ఎక్కువగా ట్రాక్టర్ల కిరాయిలకే పోతున్నయ్. నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది. మరో 20 ఎకరాల వరకు కౌలు జేస్తున్న. గతంలో డీజిల్, పెట్రోల్ ధరలు తక్కువగా ఉంటుండె. అప్పుడు ఎవుసం చేయాలనిపిచ్చేది. ఇప్పుడు వాటి ధరలు పెరుగుట్ల ఇబ్బందులవుతున్నయ్. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలె.
-సింగని పీరయ్య, కౌలు రైతు, బీర్కూర్