నిజామాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సార్వత్రిక సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాల్గో విడుత పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. ఈసారి గంట సమయాన్ని అదనంగా కేటాయించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న పోలింగ్ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17లక్షల 4వేల మంది ఓటర్లున్నారు. జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని కామారెడ్డి జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8లక్షల 76వేల మంది ఓటర్లున్నారు. రెండు జిల్లాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో రూ.1.92 కోట్ల నగదు, రూ.15.85లక్షల విలువ చేసే 7వేల 45 లీటర్ల మ ద్యం, రూ.16.50లక్షలు విలువ చేసే గంజాయి పట్టుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు, సమస్యలు తలెత్తేవి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, సార్వత్రిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. మొన్నటి వరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు అన్ని చోట్లా నిఘా మధ్యనే ఓటింగ్ జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఒక కెమెరా పోలింగ్ కేంద్రంలో, మరోటి బయట బిగించారు. దీంతో బయట ఉన్న వ్యక్తులతోపాటు లోపల జరిగే ప్రక్రియంతా అందులో నిక్షిప్తమైంది. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. నిఘా కెమెరాల లోపల చిప్ అమరుస్తున్నారు. అందులో ఎన్నికల ప్రక్రియ అంతా రికార్డు అవుతుంది. ఎక్కడైనా సమస్య ఎదురైతే వెంటనే అందులో చూసేందుకు ఆస్కారం ఉంటుంది. ఆయా సీసీ కెమెరాలను కలెక్టరేట్‌కు అనుసంధానం చేస్తున్నారు.
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 913 పోలింగ్ స్టేషన్లలో 64 ప్రాంతాల్లో 183 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో 4196 మందిని నియమించారు. అదనంగా 20శాతం అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మొత్తం 5044 మంది అందుబాటులో ఉండనున్నారు. మైక్రో అబ్జర్వర్లను కలిపితే 5143 మంది పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీవో, మరొక ఏపీవో, ఇద్దరు ఓపీవోలు ఉంటారు.

కామారెడ్డి నియోజకవర్గంలో 266 పోలింగ్ కేంద్రాలకు మొత్తం 1064 మంది, జుక్కల్ నియోజకవర్గంలో 255 పోలింగ్ కేంద్రాలకు 1020 మంది, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 270 పోలింగ్ కేంద్రాలకు 1080 మంది, బాన్సువాడలో 258 పోలింగ్ కేంద్రాలకు 1032 మందిని నియమించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో 73 మంది, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో 195 మందిని మైక్రో అబ్జర్వర్లను నియమించారు. జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని కామారెడ్డి జిల్లాలో 1977 బ్యాలెట్ యూనిట్లు, 987 కంట్రోల్ యూనిట్లు, 1107 వీవీ ప్యాట్లను ఏర్పాటు చేస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో మొత్తం 8లక్షల 76వేల 615 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు అత్యధికంగా 4లక్షల 54వేల 427 మంది, పురుషులు 4లక్షల 22వేల 145 మంది, థర్డ్ జెండర్ 43 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అధికార కాంగ్రెస్, బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో బరితెగించాయి. అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని పలుచోట్ల మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంచినట్లుగా తెలుస్తున్నది. గెలుపుపై ధీమా కోల్పోయిన ఈ రెండు జాతీయ పార్టీలు రాత్రికే రాత్రే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దొడ్డి దారిలో పయనించినట్లుగా సమాచారం. పోలీసులు, ఎన్నికల యంత్రాంగం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.