ఎన్నికల పండుగకు తెర లేసింది. సార్వత్రిక సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శనివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 13న తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుపనున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు లోక్‌సభ సీట్లు ఉన్నాయి. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 16.89 లక్షల మంది, జహీరాబాద్ సెగ్మెంట్లో 16.31 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరోవైపు, ప్రజాక్షేత్రంలో పోరుకు రాజకీయ పార్టీలు సైతం సన్నాహాలు ప్రారంభించాయి. ఇటీవలే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. సార్వత్రిక సమరానికి షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. నిజామాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్‌ను ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభ్యర్థులు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పని ప్రారంభించారు. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీగా ప్రజలతో మంచి అనుబంధం ఉన్న బీఆర్ఎస్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను చేజార్చుకోకుండా బీఆర్ఎస్ సైతం పకడ్బందీ వ్యూహాలకు పదును పెడుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తోన్న తీరును ప్రజలకు వివరించి బీఆర్ఎస్ ప్రచార పర్వంలో దూసుకు పోయేందుకు సిద్ధమవుతున్నది.
కామారెడ్డి, మార్చి 16: పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు కోసం 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల చేస్తామని, 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26 వరకు పరిశీలన, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఎస్పీ సింధూ శర్మ మాట్లాడుతూ..ప్రజలు ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని సూచించారు.
నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌లో 2.99 లక్షల ఓటర్లు ఉండగా, ఆర్మూర్‌లో అత్యల్పంగా 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. బాల్కొండ మినహా అన్ని నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌లో 289, నిజామాబాద్ రూరల్‌లో 293 పోలింగ్ కేంద్రాలున్నాయి. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భౌగోళికంగా సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉంది.
పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం సంగారెడ్డిలోనే ఉంది. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆందోల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ‘జహీరాబాద్’ లోక్‌సభ పరిధిలో ఉన్నాయి. అత్యధికంగా జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2.72 లక్షల మంది ఓటర్లుండగా, అత్యల్పంగా బాన్సువాడలో 1.95 లక్షల మంది ఓటర్లున్నారు. జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఆందోల్, జహీరాబాద్‌లో అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
గత ఎన్నికలప్పుడు మొదటి విడుతలోనే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి మాత్రం 4వ విడుతలో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. దాదాపుగా 3 నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండనున్నది. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి స్థానిక కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు రిటర్నింగ్ అధికారిగా, జహీరాబాద్ లోక్‌సభకు సంగారెడ్డి కలెక్టర్ ఆర్వోగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల దాఖలు, విత్‌డ్రా అన్ని ప్రక్రియలను వీరే పర్యవేక్షిస్తారు.
కోడ్ అమల్లోకి రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎలాంటి అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారిక పర్యటనలు వంటివేవి ఉండవు. ఒకవేళా ఎవరైనా ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చితే కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు సైతం రాజకీయ పార్టీలతో కుమ్మక్కు కావడం, ఆయా పార్టీలకు అంటకాగి పని చేస్తే వారిపైనా వేటు పడుతుంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ శాఖల్లో భారీగా బదిలీలు చేపట్టారు. మూడేళ్లుగా తిష్ట వేసిన వారిని బదిలీ చేశారు.
లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు ఉన్న వారెవ్వరినీ స్థానికంగా ఉద్యోగం చేసే అవకాశం లేకుండా వేరే నియోజకవర్గాలకు బదిలీ చేశారు. అయినప్పటికీ నిజామాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు మాత్రం ఎన్నికల సంఘం కళ్లుగప్పి ఇక్కడే తిష్ట వేసుకుని వ్యవహారాలు చక్కబెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిపాలనా బాధ్యతల్లో ఉన్న వారికి ఎన్నికలకు సంబంధం ఉండదంటూ కొందరు ఉన్నతాధికారులే వెనకేసుకొస్తుండడం గమనార్హం.