నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 13 : లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురు మదురు ఘటనలు మినహా సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యే సరికే ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను సిబ్బంది తమకు కేటాయించిన వాహనాల్లో పోలీసు భద్రత మధ్య డిచ్పల్లిలోని సీఎంసీలోని స్ట్రాంగ్ రూములకు తరలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తులు చేపట్టారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా టెంట్లు వేయడంతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు సహాయకులను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు వేగంగా పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటల తర్వాత ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగినా.. సాయంత్రం మళ్లీ జోరందుకున్నది.
చందూర్ మండలకేంద్రంలో 75.80 శాతం, మోస్రా మండల కేంద్రంలో 77.5 శాతం పోలింగ్ నమోదైనట్లు మండల ఎన్నికల అధికారులు రఫీ, తారాచంద్ తెలిపారు. రుద్రూర్ మండలంలో 80.91 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కమ్మర్పల్లి మండలంలో 38 పోలింగ్‌కేంద్రాల్లో, మోర్తాడ్ మండలంలో 29 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. ముప్కాల్ మండలంలో మొత్తం ఓటర్లు సంఖ్య 15,768 ఇందులో పురుషులు ఓటర్లు సంఖ్య 7,270 మహిళలు 8,498 మంది ఉన్నారు. ముప్కాల్ మండలంలో సుమారు 77 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో ఓటరు స్లిప్పులు అందక కొందరు ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
రెంజల్ మండలంలో 34 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. సమస్యాత్మకమైన నీలా, రెంజల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీ కోటేశ్వర్రావు పర్యవేక్షించారు. సాటాపూర్‌లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, దూపల్లిలో మాజీ ఎమ్మెల్యే సతీమణి అయేషా ఫాతిమా ఎన్నికల సరళిని తెలుసుకున్నారు. నందిపేట్, డొంకేశ్వర్ మండల కేంద్రంలో రెండు మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
తోరణాలు కట్టి, గ్రీన్ కార్పెట్ వేసి ఓటుకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అవసరమున్న చోట టెంట్లు, టేబుళ్లు ఏర్పాటు చేశారు. నవీపేట మండలంలో 68.84 శాతం పోలింగ్ నమోదైనట్లు తహసీల్దార్ నారాయణ తెలిపారు. ఏసీపీ శ్రీనవాస్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో సాయంత్రం 5గంటల వరకు 69శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి ఆర్డీవో తెలిపారు.
భీమ్‌గల్ మండల కేంద్రంలోని హైస్కూల్లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. మోర్తాడ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మంచి మెజారిటీతో గెలుస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల (బాయ్స్ హై స్కూల్)లో పోలింగ్ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు తన స్వగ్రామం మాక్లూర్ మండలంలోని వెంకటాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నవీపేట మండలంలోని తన సొంత గ్రామం సిరన్‌పల్లిలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందిపేట్, మాక్లూర్ తదితర మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పరిశీలించారు.
కంఠేశ్వర్, మే 13 : జిల్లాకేంద్రంలోని బాలుర ఐటీఐలో జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.
కోటగిరి, మే 13 : కోటగిరిలోని హైస్కూల్, చావిడిగల్లీ, ఎస్సీ కాలనీ, మిర్జాపూర్క్యాంప్లో పోలింగ్ కేంద్రాలను మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. చందూర్, మోస్రా మండలకేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడి పోలింగ్ గురించి తెలుసుకున్నారు.
బోధన్, మే 13: బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్లో చెదురుమదురు సంఘటనలు తప్ప 246 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సజావుగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 70.84 శాతం పోలింగ్ నమోదైంది. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి తన భర్త శరత్‌రెడ్డితో కలిసి బోధన్‌లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
శక్కర్‌నగర్, మే13:బోధన్ పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు గట్టి బందోబస్తు చేపట్టాయి. పట్టణంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు, పలు పోలింగ్ కేంద్రాలను ఏసీపీ శ్రీనివాస్ సిబ్బందితో పర్యవేక్షించారు. ఏసీపీ నేతృత్వంలో పట్టణ, రూరల్ సీఐలు ఎస్.వీరయ్య, కోల నరేశ్‌తోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, రిజర్వు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
వినాయక్‌నగర్, మే 13 : జిలావ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్లు సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ తెలిపారు. అల్లరు జరగకుండా ప్రతి పోలింగ్ సెంటర్ సివిల్ పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు, మొబైల్ పెట్రోలింగ్, స్పెషల్ పోలీస్ ఫోర్స్, మఫ్టీ సిబ్బంది, ట్రైనీ పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారని వివరించారు. ఫొటో, వీడియో చిత్రీకరణతో పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో భద్రతను సీపీ పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.