మాక్లూర్, డిసెంబర్4: మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన రుణాలకు రెండింతలు అందజేస్తూ మహిళల అభ్యున్నతికి సర్కారు కృషి చేస్తోంది. సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలే 90 శాతం సభ్యులుగా ఉన్నారు. ఈ వర్గాల వారు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారు. మండలంలో 1423 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటిలో 15,366 మంది సభ్యులుగా ఉన్నారు. గతంలో సంఘానికి రూ.10 లక్షల రుణాలు ఇవ్వగా ప్రస్తుతం ప్రభుత్వం రూ.20లక్షల వరకు పెంచింది. ఇప్పటి వరకు ప్రతి సంఘానికీ రూ.5 లక్షలు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు. సంఘాలు 12 నుంచి 15 శాతం వడ్డీ బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చేది. దీంతో మహిళ సంఘాల ఆదాయం వడ్డీలు చెల్లించేందుకే సరిపోయేది. ఇలాంటి పరిస్థితి నుంచి డ్వాక్రా మహిళలను గట్టెక్కించడానికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలను రూ.15 నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వ్యాపారాలతోపాటు, కూరగాయల పంటలసాగు, పాడి గేదెల కొనుగోలు, బట్టల షాపులు, బ్యాంగిల్ స్టోర్స్, మెడికల్ షాపుల నిర్వహణ, సూపర్ మార్కెట్లు, హోటళ్లు వంటివి ప్రారంభించేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది.
మండలంలో 28 గ్రామాల్లో 1423 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటిలో 15,366 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ లబ్ధి చేకూర నున్నది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం మహిళకు వడ్డీలేని రుణాలు రెట్టింపు అందుతున్నాయి. వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈ యేడాది అన్ని రకాల పథకాలకు రూ.54 కోట్లను (వీఎల్ఆర్) వడ్డీ లేకుండా రుణాలు అందించాలని నిర్ణయించాం. గ్రామ సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.20లక్షల వరకు రుణాలు అందిస్తున్నాం.
– అనిల్‌కుమార్, ఐకేపీ, ఏపీఎం
వడ్డీలేని రుణాలు తీసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. గ్రూపులో 10 మంది సభ్యులుంటారు. ఒకొక్కరికి రూ.2లక్షల వరకు రుణం వస్తుంది. ఎలాంటి ఒత్తిడీ లేకుండా రుణం అందడంతో వ్యాపారం చేసుకుంటున్నారు. షరతులు లేకుండా రుణం అందుతుంది. వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో సకాలంలోనే బ్యాంకులకు చెల్లిస్తున్నారు. – లత, వీవోఏ, మాదాపూర్