నిజామాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోలీసుల ఆంక్షల వేళ మద్యం విక్రయాలు పోటెత్తాయి. బీర్లు, లిక్కర్ అమ్మకాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధిస్తే అసలు అమ్మకాలే చేపట్టొద్దు. కానీ, అందుకు విరుద్ధంగా భారీగా విక్రయాలు చోటు చేసుకోవడం విస్మయానికి గురి చేస్తున్నది. వినాయక నిమజ్జనం సందర్భంగా సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. బహిరంగ మద్యపానాన్ని నిషేధిస్తూ సీపీ ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వారం వ్యవధిలో రెండు రోజుల పాటు (ఆది, మంగళవారాల్లో) అమ్మకాలను నిలిపి వేయాలని ఆదేశించారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్గా తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం సెక్షన్ 20(1)ని అనుసరించి ఆంక్షలు విధించారు. కానీ సీపీ ఆదేశాలకు విరుద్ధంగా భారీగా మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. మద్యం వ్యాపారుల దురాశకు తోడు కొందరు ఎక్సైజ్, పోలీసు శాఖ సిబ్బంది వారికి సహకరించడం వల్లే నిషేధ కాలంలోనూ విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి.
మాక్లూర్ మండలం మాదాపూర్లోని ఐఎంఎల్ డిపో గణాంకాల ప్రకారం.. గత వారం రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా రూ.27.73 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 11న ఉమ్మడి జిల్లాలో కేవలం రూ.62 లక్షల విలువ చేసే 456 లిక్కర్ కేసులు, 1831 బీర్ కేసులు విక్రయించగా, 12వ తేదీన ఏకంగా రూ.6.25కోట్లు, 13వ తేదీన కూడా రూ.5.10కోట్లు, 14న రూ.4.82 కోట్ల మద్యాన్ని వైన్ షాపుల యజమానులు కొనుగోలు చేశారు. ఆంక్షలు అమలు అవుతాయనే ముందుచూపుతోనే నిల్వ చేసుకుని, ఆ తర్వాత పక్కదారి పట్టించారు. సెప్టెంబర్ 18న (బుధవారం) రికార్డు స్థాయిలో రూ.10.30 కోట్లు విలువ చేసే 8,650 లిక్కర్ కేసులు, 27,421 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. పోలీసుల ఆంక్షలు నిక్కచ్చిగా అమలై ఉంటే రూ.కోట్ల విలువ చేసే మద్యం ఎక్కడికక్కడే ఉండిపోవాలి. అలా కాకుండా రికార్డు స్థాయిలో లిక్కర్ బాటిళ్లు, బీర్ సీసాలకు వైన్ షాపుల నుంచి ఇండెంట్ రావడం మద్యం వ్యాపారుల గిమ్మిక్కును, పోలీసులు, ఎక్సైజ్ శాఖ తీరును తేటతెల్లం చేస్తున్నది.