నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలను భారీ వర్షం ముంచెత్తింది. ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామ పరిధిలోని ముత్యాల వాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వర్షపునీరు వాడీ గ్రామాన్ని చుట్టుముట్టింది. నడిమితండా, లక్ష్మీ చెరువు తండా, బీరప్ప తండా, కార్నల్ తండాలను సైతం వరద ముంచెత్తింది. చేతికందిన వస్తువులు పట్టుకుని దాబాలపైకి చేరారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి రక్షణ చర్యలు చేపట్టింది. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహాయక చర్యలను పరిశీలించారు.
సిరికొండ మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. ముత్యాల చెరువు కట్ట తెగడంతో గడ్కోల్, ముసీర్నగర్, కొండూర్ గ్రామల్లోకి నీరు వచ్చి చేరింది. వరద ఉధృతికి కొండూర్ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో నిజామాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండలోని విద్యానగర్ కాలనీ నీట మునిగింది.
ఇందల్వాయి మండలంలోని జీకే తండా, గౌరారం తండా పూర్తిగా జలమయమైంది. జీకే తండా చెరువు కట్ట తెగిపోయింది. సిర్నాపల్లిలోని రామన్న చెరువు కట్ట తెగిపోవడంతో బుగ్గవాగు ఉప్పొంగింది. దిగువన ఉన్న కాలనీల్లో నీరు చేరడంతో పాటు స్వర్గరథం, ట్రాక్టర్ ట్రాలీ కొట్టుకుపోయాయి. పొలాలు నీట మునిగాయి. గన్నారం జోర్నాథ్ చెరువు, పటేల్ చెరువు రెండు ఉప్పొంగడంతో జాతీయ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఉగ్రరూపం దాల్చిన గోదావరి..
నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెంజల్ మండలంలోని కందకుర్తి ఉధృతంగా ప్రవహించింది. అంతర్రాష్ట్ర వంతెన పైనుంచి 6 అడుగల మేర వరద ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. త్రివేణి సంగమక్షేత్రం సమీపంలోని సీతారాంసంత్ ఆశ్రమంలో సాధవులు, భక్తులు చిక్కుకుపోయారు. రెండు అడుగుల మేర ఆశ్రమంలోకి వరద చేరుకోగా, ఎస్డీఆర్ఎఫ్ మూడు గంటలు శ్రమించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నవీపేట మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. కోటగిరి, చందూర్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. చందూరులోకి మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోతంగల్ మండలంలోని పంట పొలాలను మంజీర ముంచెత్తింది.
ముంచెత్తిన మంజీర
నిజాంసాగర్ ప్రాజెక్టును భారీగా వస్తున్న నీటితో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. గత 20 ఏండ్లలో ఎన్నడూ రానంత వరద వస్తుండడంతో బోధన్, సాలూర మండల్లాలోని హంగర్గా, కొప్పర్గ, హున్సా, మందర్న, ఖాజాపూర్ గ్రామాలు వణికిపోయాయి. హంగర్గా గ్రామాన్ని మంజీర వరద చుట్టుముట్టింది. కొప్పర్గ, ఖండ్గావ్, భిక్నెల్లి గ్రామాల పంటలు ఇప్పటికే నీట మునిగాయి. సాలూర వద్ద గల పురాతన వంతెన పైనుంచి 5 అడుగుల ఎత్తున వరద ప్రహిస్తున్నది.
పాల్వంచలో రామన్న పర్యటన
వరద ఉధృతితో అల్లాడుతోన్న కామారెడ్డి పరిస్థితిని చూసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించి పోయారు. రాజన్న సిరిసిల్లా జిల్లా నర్మాలాలో ప్రమాదకరమైన దుస్థితిని స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన కామారెడ్డి జిల్లాకు పయనమయ్యారు. మాచారెడ్డి మండలం పాల్వంచ వాగు వద్ద కోతకు గురైన బ్రిడ్జిని, వాగు ఉధృతిని కేటీఆర్ పరిశీలించారు. అక్కడ్నుంచి కామారెడ్డి పట్టణానికి వెళ్లాల్సి ఉండగా వరద ఉధృతితో వీలు కాలేదు. ఇతర ప్రత్యమ్నాయ మార్గాల్లోనూ రోడ్లు కొట్టుకుపోవడం, రహదారులపై వరద పారుతుండటంతో సిరిసిల్లాకు వెనుదిరిగారు. పాల్వంచ బ్రిడ్జి వద్ద పలువురు ప్రజలతా ముచ్చటించారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా కల్పించారు. వరద బాధితులకు అండగా ఉండాలని గులాబీ శ్రేణులకు సూచించారు.
భీమ్గల్లో జల విధ్వంసం
భీమ్గల్ మండలం తూంపల్లి కొండాపూర్లో కురిసిన విపరీతమైన వర్షానికి కప్పలవాగు పోటెత్తి గోన్గొప్పుల్, సికింద్రాపూర్, బెజ్జోరా, భీమ్గల్లో భారీ నష్టం చేకూర్చింది. భీమ్గల్లోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముంచెత్తింది. ఆకస్మిక వరదలు మొదటి అంతస్తు వరకు ముంచెత్తడంతో ఇద్దరు చిక్కుకుపోయారు. వారిని సహాయక బృందాలు కాపాడాయి. భీమ్గల్-బడాభీమ్గల్ మధ్య ఉన్న బ్రిడ్జికి పగుళ్లు రావడంతో పాటు రెయిలింగ్ కూలిపోయింది. బడాభీమ్గల్కు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. పలు చోట్ల స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. భారీ వర్షాలతో ఆర్మూర్లో కమలాకర్ నెహ్రూ కాలనీలో గుట్ట పైనుంచి రాయి జారిపడడంతో ఇంటి ప్రహారి ధ్వంసమైంది.