నిజామాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అంబేద్కర్ జయంతి రోజే దళిత ప్రజాప్రతినిధిపై కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. ఎక్కడైతే దళితుల పట్ల పోలీసులు అతిగా ప్రవర్తించారో అక్కడే ఆత్మగౌరవ గర్జన పేరిట కార్యక్రమం నిర్వహించనున్నది. లింగంపేటలో నేడు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కాంగ్రెస్ నేతలు, పోలీసులు కలిసి రాక్షసంగా ప్రవర్తించి అవమానించిన మాజీ ఎంపీపీ సాయిలుతో పాటు ఇతర దళితులకు భరోసా కల్పించనున్నారు.
కామారెడ్డి, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు లింగంపేటలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరుతారని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు లింగంపేట్‌లో దళిత ఆత్మగౌరవ గర్జన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దళిత నాయకుడు ముదాం సాయిలు కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు. 2.30 గంటలకు నాగిరెడ్డిపేటలో భోజనం చేసి తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బయల్దేరుతారని పేర్కొన్నారు.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున పోలీసులు దళితుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. లింగంపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాలకుల ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు.. దళిత నేతలపై దాష్టికాన్ని ప్రదర్శించారు. దళిత నాయకుడైన మాజీ ఎం పీపీ ముదాం సాయిలును సీఐ, ఇతర పోలీసులు టార్గెట్‌గా చేసుకున్నారు. ఒంటి మీద దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. అర్ధనగ్నంగా మారిన దళిత నేతపై కనికరం కూడా లేకుండా పోలీసులు ప్రతాపం చూపించారు.
ఈ నేపథ్యంలో కాం గ్రెస్ నేతలు, పోలీసుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దళిత నాయకుడికి అంబేద్కర్ జ యంతి రోజునే ఎదురైన ఘోరమైన పరాభవాన్ని బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకున్నది. వెంటనే స్పందించిన కేటీఆ ర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యం లో అమానవీయ ఘటనకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆత్మగౌరవ గర్జన నిర్వహించనున్నది. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే జాజాల నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా విఫలమైంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతులెత్తేసింది. వంద రోజుల్లోనే హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్ సర్కారు.. ఇప్పటిదాకా ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా చేయలేదు. రైతు రుణమాఫీని సైతం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కామారెడ్డి జిల్లాకు చెందిన వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఇప్పటికీ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రైతుభరోసా పథకం కింద గతంలో ఎగ్గొట్టిన నిధుల ఊసే లేకుండా పోయింది. కేసీఆర్ పాలనలో సమయానికి ఎరువులు, విత్తనాలు పొందిన రైతులు.. ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెప్పులు, పాస్ బుక్కులను క్యూ లైన్లో పెట్టి బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. అతివలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకపోవడంపై మహిళా లోకం మండిపడుతున్నది. ఇక దళితుల పట్ల దౌర్జన్యాలు పెరిగిపోయిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు దాష్టికాలు, హామీల ఎగవేతపై ప్రశ్నించడానికి కేటీఆర్ స్వయంగా లింగంపేటకు రానున్నారు. దళిత నాయకుడ్ని అవమానించిన ప్రాంతంలోనే కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు గులాబీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలి రానున్నారు.
పాలనలో విఫలమైన కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి చేస్తున్నది. రైతులు, యువత, మహిళలను దారుణంగా మోసగించిన కాంగ్రెస్ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నది. కాగా, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించేందుకు బీజేపీ ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ పదేండ్ల సంక్షేమ పాలనపై గతంలో తరచూ తప్పుడు ఆరోపణలు చేసే బీజేపీ నాయకులు ఇప్పుడు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా మారినట్లు ఆరోపణలుండగా, వాటిని నిజం చేసేలా కాషాయ నేతలు ప్రవర్తిస్తున్నారు. బీజేపీ మౌనం వహిస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నది. ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్నది. 20 నెలల కాంగ్రెస్ దుష్ట పాలనను అసహ్యించుకుంటున్న జనం కేసీఆర్ పాలనను తలచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు.