నిజామాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితిలోకి భారీ ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను వదిలి కారు ఎక్కేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతున్నారు. అధికారం కోల్పోయిన వెంటనే కొంత మంది బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార పార్టీల్లో చేరారు. నిరాశ, నిస్పృహకు గురి కాకుండా గులాబీ శ్రేణులంతా గులాబీ జెండాను నమ్ముకుని ప్రజల కోసం పని చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే ప్రజల్లో పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కోల్పోయింది. దీంతో పార్టీ మారిన వారంతా కంగుతినాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదని గ్రహించి ఇబ్బందికరమైన పరిస్థితిని వారంతా ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పును ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గులాబీ పార్టీ మరోసారి గుభాళిస్తోంది.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కొనసాగుతోన్న విజయ భారతి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాషాయ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ జడ్పీ ఛైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, అయేషా ఫాతిమా ఇతర కీలక నేతల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు అంజిరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా రామచంద్రరావు తొలి పర్యటన కొనసాగుతుండగా బీజేపీ కీలక నేత పార్టీ వీడటం కాషాయ నేతలకు మింగుడు పడటం లేదు. ఎంపీ అర్వింద్ పుట్టిన రోజునే భారీ ఝలక్ తగలడం బీజేపీలో చర్చనీయాంశం అవుతోంది.
జాతీయ పార్టీలకు షాక్..
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. జాతీయ పార్టీలైనప్పటికీ నేతలెవ్వరూ ఆ పార్టీలను నమ్మడం లేదు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీలకు గుడ్ బై చెప్పి ముఖ్య నాయకులంతా గులాబీ జెండాను చేత పట్టుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట కీలక రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
గ్రామ, మండల స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల సారథ్యంలో ఇప్పటికే గులాబీ కండువా కప్పుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలోనూ చేరికలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో భారీగా చేరికలు జరిగాయి.
అంతకు పూర్వం మైనార్టీ లీడర్లు సైతం మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నేతృత్వంలో చేరికలు కొనసాగాయి. ఆదివారం జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నేతృత్వంలోనూ చేరికలు జరిగాయి. గతంలో కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలోనూ వలసలు కొనసాగాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ గులాబీ గూటికి చాలా మంది వచ్చి చేరుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా అంతటా కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి గులాబీ గూటికి వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
బాన్సువాడలోనూ భారీ చేరికలు..
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు, రైతు సమన్వయ సమితి కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని వీడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆర్మూర్లో కీలక నేతలు చేరినట్లే బాన్సువాడ నియోజకవర్గంలోనూ త్వరలో భారీ ఎత్తున గులాబీ గూటికి వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు.
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి, వర్ని, పోతంగల్, చందూర్, మోస్రా మండలాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని వీడెందుకు నేతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీరంతా కొద్ది రోజుల్లోనే గులాబీ కండువా ధరించనున్నారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు పాలకవర్గాలు కరువయ్యాయి. పదవీ కాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. ప్రజల్లో ఏర్పడిన భారీ వ్యతిరేకతను తట్టుకునే ధైర్యం లేక రేవంత్ రెడ్డి సర్కారు తీవ్ర జాప్యం చేస్తోంది.
హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరులోగా తెలంగాణ వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది. నెలన్నర కాలం గడిసినప్పటికీ ఎన్నికల ఊసెత్తడానికి కాంగ్రెస్ పార్టీ భయ పడుతోంది. నేడో రేపో ఎన్నికలు నిర్వహించడం తప్పని పరిస్థితి ఏర్పడిన సందర్భంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్కు వలసలు పెరగడం ఆసక్తికరంగా మారింది.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్లో అంతర్యుద్ధం, ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి నేపథ్యంలో పాత తరం కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్కు జై కొట్టేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలిసింది.