ఏర్గట్ల/ఖలీల్‌వాడి, మార్చి 27: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆదుకోవాలన్నారు. శుక్రవారం పార్లమెంట్లో జరిగిన పైనాన్స్ బిల్లు చర్చలో భాగంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, రైతాంగ సవాళ్లు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై గళమెత్తారు. అంతర్జాతీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయులు, ముఖ్యంగా తెలంగాణకు చెందిన కార్మికుల సంక్షేమంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గల్లో మరణించిన వారి మృతదేహాలను స్వదేశాలకు తీసుకురావడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాని, ఉద్యోగాలు కోల్పోయి తిరిగి వస్తున్న వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిచాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే మూడు నెలల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరారు. యూరియా తయారీకి అవసరమైన గ్యాస్ కోసం 90 శాతం విదేశాలపైనే ఆధారపడి ఉన్నామని, గల్ఫ్ దేశాల్లోని ఉద్రిక్తత వల్ల సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతేడాది తెలంగాణలో యూరియా కొరత వల్ల రైతులు ఎదుర్కొన్న లాఠీచార్జి వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, ఎరువుల పంపిణీపై రాష్ర్టాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ ఎరువుల వైపు రైతులను మళ్లించాలని సురేశ్‌రెడ్డి కేంద్రానికి సూచించారు. పట్టణాల్లో ఏటా ఉత్పత్తయ్యే 30 మిలియన్ టన్నుల తడి వ్యర్థాలను శాస్రీయంగా ప్రాసెస్ చేసి సేంద్రీయ ఎరువులుగా మార్చాలని, దీనిని యూపీఐ తరహాలో ఒక విప్లవాత్మక మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇది మట్టి సారాన్ని పెంచడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థిక విధానాలను సమన్వయం చేయాలని కోరారు.
రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ఎన్నికల హామీలను చట్టబద్దం చేయాలని కేఆర్ సురేశ్‌రెడ్డి ప్రతిపాదించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆయన ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య బలోపేతానికి దేశవ్యాప్తంగా ఇలాంటి చట్టం అవసరమని స్పష్టం చేశారు.