బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 14 : బాన్సువాడ మండలంలో ఓ గురుకుల విద్యార్థిని కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. కొందరు యువకుల చొరవతో సదరు బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి విద్యార్థిని, యువకులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి వరసకు అన్న అయ్యే ఓ యువకుడు బాన్సువాడ గురుకులం నుంచి ఓ విద్యార్థినిని బైక్‌పై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లకుండా మొండిసడాక్ వైపు వెళ్లాడు. మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్‌ను అక్కడే వదిలేసి, లిఫ్ట్ అడిగి మరో బైక్‌పై ఇద్దరూ మొండిసడాక్ వరకు వెళ్లారు. పెట్రోల్ కోసం సదరు యువకుడు ఇతరుల వద్ద డబ్బులు అడుగుతుండగా.. అనుమానం వచ్చిన విద్యార్థిని ఓ యువకుడి ఫోన్ ద్వారా ఇంటికి ఫోన్‌చేసి, జరిగిన విషయం తన తల్లికి వివరించింది.
వెంటనే విద్యార్థిని తల్లి ఫోన్ ఇచ్చిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ అమ్మాయిని కాపాడాలని కోరింది. దీంతో సదరు వ్యక్తి అక్కడున్నవారికి విషయం చెప్పి విద్యార్థినిని బైక్‌పై తీసుకువచ్చిన యువకుడిని నిలదీయడంతో వారిపై దాడికి దిగాడు. దీంతో అతడిని వారు తాడుతో బంధించి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. బాన్సువాడ సీఐ మండల అశోక్ అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకొని బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి గురుకుల పాఠశాల తరగతి గది నుంచి బాలికను తీసుకెళ్తున్నా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పాఠశాల నుంచి బాలికను బయటికి తీసుకెళ్లి రెండు గంటలు గడిచినప్పటికీ ప్రిన్సిపాల్ లేదా సిబ్బందిగాని తల్లిదండ్రులకు లేకుంటే పోలీసులకు సమచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అదుపులోకి తీసుకున్న యువకుడి వద్ద కటింగ్ ప్లెయర్, స్క్రూ డ్రైవర్, ఇనుప వైరు లభించాయి. విద్యార్థిని తల్లికి ఫోనులో సమాచారం ఇవ్వకుంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదోనని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ అశోక్ మాట్లాడుతూ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడని, వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించినట్లు తెలిపారు. సదరు యువకుడిపై ప్రిన్సిపాల్ రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.