గాంధారి/బిచ్కుంద, డిసెంబర్ 28:సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెతో విద్యాబోధన ముందుకు సాగక పోవడంతో విద్యార్థినులు శనివారం రోడ్డెక్కారు. మా చదవులు ఆగిపోయాయి.. మా ఉపాధ్యాయులు మాకు కావాలంటూ గాంధారి, బిచ్కుం ద మండలాల్లోని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సబ్జెక్టు టీచర్లు, లెక్చరర్లు లేక, పాఠాలు చెప్పే తాత్కాలిక సిబ్బంది రాక నష్టపోతున్నామని పాఠశాలల ఎదుట బైఠాయించారు. గతేడాది వరకు సరిపడా టీచర్లు, సకల వసతులతో కళకళాడిన కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతున్నాయి.
రెగ్యులర్ టీచర్లు, లెక్చరర్లు లేక సిలబస్ ముందుకు సాగడం లేదు. ఇన్నాళ్లు పాఠాలు చెప్పిన సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో పాఠాలు పూర్తిగా నిలిచి పోయాయి. నెల క్రితం గెస్టు టీచర్లు, లెక్చరర్లను నియమించినా కొందరు రావడం లేదు. గాంధారిలో ఆరుగురు మాత్రమే పాఠాలు చెబుతూ, పిల్లల బాగోగులను చూస్తున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సిలబస్ పూర్తి కాక, విద్యాబోధన సాగక విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, నాసిరకం భోజనం తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు శనివారం ధర్నాకు దిగారు.
సరిపడా టీచర్లు.. షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి.. కడుపు నిండా కమ్మని భోజనం.. ఇంట్లో ఉన్నట్లే సకల వసతులు.. ఇది గతేడాది వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనిపించిన పరిస్థితి. కానీ ఏడాదిలోనే ఎంతో మార్పు వచ్చింది. పాఠాలు చెప్పే వారు లేరు. ఉన్న వారు సమ్మెకు దిగారు. భోజనం, వసతులు అంతంతే అన్నట్లు మారాయి. దీంతో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యాబోధన నిలిచి పోవడంపై ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా శనివారం గాంధారి, బిచ్కుంద మండలాల్లో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
వివిధ డిమాండ్ల సాధన కోసం కేజీబీవీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు సమ్మెలో ఉన్నారు. ఛాయ్ తాగినంత సమయంలోనే సమస్యను పరిష్కరిస్తామని రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. పాఠాలు చెప్పే వారు రాకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో విద్యార్థినులు నష్టపోతున్నారు. మరోవైపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భోజనం నాసిరకంగా మారిందని వారు వాపోతున్నారు. తమకు భోజనం సరిగా పెట్టక పోయినా.. పాఠాలు చెప్పే వారు కావాలని కోరుతున్నారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలిసి అధికారులు అక్కడకికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
గాంధారిలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇక్కడ హిందీ, బాటనీ, మ్యాథ్స్ బోధించే శాశ్వత ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేకపోవడంతో సిలబస్ ముందుకు సాగడం లేదు. గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నప్పటికీ వారు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. సిలబస్ పూర్తి కాకపోవడం, వార్షిక పరీక్షలు దగ్గరకొస్తుండడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. పాఠాలు బోధించే వారు లేకపోతే పరీక్షల్లో ఏం రాయాలని ప్రశ్నిస్తున్నారు.
గాంధారి కేజీబీవీలో బైపీసీ సెకండియర్ చదువుతున్నా. ఇక్కడ ఇంటర్ ఫస్ట్ బ్యాచ్ మాదే. ఏడాది నుంచి బాటనీ లెక్చరర్ లేడు. పాఠాలు చెప్పే వారు లేకపోతే అవి మాకు ఎలా అర్థమవుతాయ్. ఎలా చదవాలో అర్థమైతలేదు. బాటనీ సబ్జెక్టును బోధించే వారు లేకపోవడంతో వచ్చే పరీక్షలో ఏం రాయాల్నో ఏమో?
– నవ్యశ్రీ, సెకండియర్, కేజీబీవీ, గాంధారి
నేను పదో తరగతి చదువుతున్నా. వార్షిక పరీక్షలకు సమయం ఎక్కువ లేదు. పాఠశాల ప్రారంభమై ఆర్నెళ్లు గడుస్తున్నా సిలబస్ ఇంకా పూర్తి కాలేదు. నెల రోజుల క్రితం టీచర్లను నియమించినా వారు కొన్ని రోజులు పాఠాలు చెప్పి వెళ్లి పోతున్నారు. మాకు బోధించే టీచర్లు సమ్మెలో ఉండడంతో చదువులు ముందుకు సాగడం లేదు. పరీక్షలు ఎలా రాయాలో అర్థమైతలేదు.
– లత,10వ తరగతి, కేజీబీవీ, గాంధారి
మా ఉపాధ్యాయులు 20రోజుల నుంచి ధర్నాకు వెళ్తున్నారు. అక్కడి నుంచి వచ్చాక క్లాసులు తీసుకుంటారని చూస్తున్నాం. కానీ వాళ్లు పాఠాలు చెప్పకుండా రివిజన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఎన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి. వేరే ఉపాధ్యాయులను పంపిస్తే వారు చెప్పే పాఠాలు మాకు అర్థం కావు. మా ఉపాధ్యాయులే మాకు కావాలి.
– పద్మ, కేజీబీవీ, బిచ్కుంద
గాంధారి కేజీబీవీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నా. ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ బాటనీతో పాటు ఇతర సబ్జెక్టుల పాఠాలను ప్రారంభించనే లేదు. పాఠాలు చెప్పే వారు సమ్మె చేస్తున్నారు. రెండు నెలలు గడిస్తే వార్షిక పరీక్షలు వస్తాయి. సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు ఎట్లా రాయాలి? మమ్మల్ని పట్టించుకునే వారే లేరు.
– అఖిల, ఫస్టియర్, కేజీబీవీ, గాంధారి