గాంధారి, ఫిబ్రవరి 4: కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని ముదెల్లి గ్రామంలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడు సంవత్సరాల్లో జరిగిందని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నట్లు చెప్పారు. ఇల్లంటే నూరేండ్ల పంట అని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని అన్నారు. పొరుగు రాష్ర్టాల్లో జరగని అభివృద్ధి తెలంగాణ జరుగుతున్నదని తెలిపారు. కరోనా కష్టకాలంలో సైతం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లను నాణ్యతతో నిర్మించాలని సూచించారు. త్వరలో లబ్ధిదారులకు సొంత స్థలంలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామం నుంచి గాంధారి మండలం నర్సాపూర్ మీదుగా ముదెల్లి వరకు రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు తీసుకోనున్నట్లు చెప్పారు. దీంతో పాటు బాన్సువాడ, కామారెడ్డి రోడ్డుపై బుగ్గరామన్న ఆలయ సమీపంలో అటవీశాఖ అనుమతులతో రోడ్డు వెడల్పు చేయనున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. అటవీశాఖ అనుమతులతో త్వరలోనే గండివేట్ మీదుగా వెల్లుట్ల, ఎల్లారెడ్డి రోడ్డుతో పాటు పొతంగల్ నుంచి చందానాయక్ తండా వరకు పెండింగ్‌లో ఉన్న రోడ్డును పూర్తిచేయనున్నట్లు తెలిపారు. రూ. 10 కోట్లతో గాంధారి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, ముదెల్లి గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణానికి అదనంగా రూ. 30 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.
కార్యక్రమంలో సర్పంచ్ పిట్ల కళావతి లక్ష్మణ్, ఎంపీపీ రాధాబలరాం, జడ్పీటీసీ శంకర్‌నాయక్, డీఎఫ్‌వో నిఖిత, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మమ్మాయి సంజీవ్, గాంధారి, ముదెల్లి విండో చైర్మన్లు సాయికుమార్, సాయిరాం, కాలభైరవ ఆలయ కమిటీ చైర్పర్సన్ మాలతీసంతోష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యం పటేల్, శివాజీరావు, ముకుంద్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శివాజీ, విండో డైరెక్టర్ తాడ్వాయి సంతోష్‌తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.