అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌కు బోధన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో బోధన్ పరిసరాలన్నీ జనసంద్రమయ్యాయి. అభిమాన నేతను చూసేందుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీంతో దారులన్నీ బోధన్ వైపే అన్నచందంగా మారాయి. పెద్ద సంఖ్యలో జనం హాజరుకావడంతో సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన పనులు, రైతులు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి అమలు చేసిన పథకాలను సీఎం కేసీఆర్ వివరించగా.. జనమంతా చప్పట్లతో హోరెత్తించారు. బోధన్ అభ్యర్థి మహ్మద్ షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపించి, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరగా.. ప్రజలంతా తమ మద్దతును తెలిపారు. కేసీఆర్ ప్రసంగం కొనసాగినంత సేపు యువత ఈలలు, కేరింతలు కొడుతూ ఉత్సాహం చూపారు.