నిజామాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాతా, శిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి పెద్దపీట వేస్తున్నది. రూ.వందల కోట్లు వెచ్చించి వారి ఆరోగ్యాన్ని సంరక్షించే చర్యలను చేపడుతున్నది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన మహిళామూర్తులకు ఆర్థిక భారం నుంచి తప్పించేందుకు అనేక చర్యలను చేపట్టింది. రాష్ట్ర సర్కారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రసవాల్లో సహజ కాన్పులకు ప్రోత్సాహం అందిస్తున్నది. శస్త్ర చికిత్సల నివారణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. మౌలిక సదుపాయాలను సమృద్ధిగా కల్పించడం ద్వారా ప్రభుత్వ దవాఖానల్లోనే భారీగా ప్రసవాలు జరిగే విధంగా ప్రభుత్వం ముందడుగు సాధించింది. ఇందుకోసం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకు వచ్చి మహిళా లోకాన్ని సర్కారు దవాఖానాల వైపు అడుగులు వేసే విధంగా ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నది. ఇలా వినూత్న రీతిలో కృషి చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక కార్యక్రమాన్ని అమలుకు నిర్ణయించింది. ఎనీమియాతో బాధపడుతున్న గర్భిణులకు అండగా నిలవాలని తలిచింది. ఇందులో భాగంగా 9 జిల్లాల్లో త్వరలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయబోతుండగా ఇందులో కామారెడ్డి జిల్లా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సుమారు 10వేల మందికి లబ్ధి చేకూరబోతున్నది.
పేదరికమో, అవగాహన రాహిత్యమో కానీ గ్రామీ ణ ప్రాంతాల్లో అనేక మంది పండంటి బిడ్డకు జన్మనిచ్చే మహిళలు తీవ్రమైన అవస్థలకు గురవుతున్నారు. పోషకాహార లోపంతో తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్తహీనతతో బాధపడే వారు ప్రసవ సమయంలో తీవ్రమైన ఇక్కట్లతో సతమతం అవుతున్నారు. గర్భిణులు ప్రతి బుధవారం ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించుకుని రక్తహీనతను అధిగమించేందుకు ఐరన్ టాబ్లెట్లు వాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం పంపిణీ జరుగుతున్నది. విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపడుతున్నప్పటికీ అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాలో కనిపిస్తోంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పౌష్టికాహారంతో కూడిన కిట్లను అందించి గర్భిణుల్లో రక్తహీనత సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. రక్తహీనతను ఎదుర్కొంటున్న గర్భిణుల్లో కామారెడ్డి జిల్లా సైతం ముందు వరుసలో ఉన్నది.
తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత అంగన్వాడీలను బలోపేతం చేసింది. వైద్యారోగ్య శాఖ సైతం గతం కన్నా మెరుగైంది. ఈ రెండు శాఖల సహకారంతో గర్భిణుల్లో పోషకాహార లోపం లేకుండా సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. అంగన్వాడీల ద్వారా ప్రత్యేకంగా ఆహారాన్ని అందిస్తోంది. క్షేత్ర స్థాయిలో గర్భం దాల్చిన మహిళలకు ఎనీమియా ఇబ్బందులపై సరైన అవగాహన కల్పించడంలో ఇరు శాఖలు వైఫల్యం చెందుతున్నాయి. అందుకే కామారెడ్డి జిల్లాలో అధిక రక్త హీనతతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. దీంతో సర్కారు చేపట్టబోతున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమంలో తొలి 9 జిల్లాల్లో కామారెడ్డిని సైతం చేర్చాల్సి వచ్చింది. సమన్వయం లేకపోవడంతో పాటు జిల్లా స్థాయి అధికారుల ప్రణాళిక, పర్యవేక్షణ లోపంతోనే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. పోషకాహార లోపంతో మూలంగా గర్భిణుల్లో రక్తహీనతకు దారితీస్తుండగా అధిక మంది చిన్నపాటి నిర్లక్ష్యంతో వైద్యుల సలహాలు పాటించకపోవడం, మందులు వాడకపోవడం కారణాలుగా నిలుస్తోంది. తద్వారా సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వైద్య, ఐసీడీఎస్ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉండగా కామారెడ్డిలో ప్రభావవంతంగా ఉండడం లేదు.
రూ.2వేలు విలువ చేసే కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. తద్వారా ప్రైవేటు దవాఖానల్లో రూ.వేలల్లో డబ్బులు వెచ్చించాల్సిన గత్యంతరం నుంచి బయట పడుతున్నారు. గతంలో ప్రతి గ్రామం నుంచి ఆర్ఎంపీల ద్వారా ప్రైవేటు దవాఖానలకు తండోపతండాలుగా గర్భిణీలు వరుస కట్టేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సర్కారు దవాఖానాల్లోనే ప్రసవాలు ఉచితంగా జరగడంతో పాటు ప్రసవించిన అనంతరం కేసీఆర్ కిట్ సైతం అందుతున్నది. ఆడ శిశువుకు జన్మనిస్తే రూ.13వేలు, మగ శిశువుకు జన్మనిస్తే రూ.12వేలు ప్రోత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. అచ్చంగా కేసీఆర్ కిట్ మాదిరిగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు కాబోతున్నది. కేసీఆర్ కిట్ అన్నది తల్లీబిడ్డలకు ఉపయుక్తంగా మారనుండగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భిణికి, గర్భంలోని శిశువుకు కూడా ఉపయోగపడనున్నది. డిసెంబర్ 3వ తేదీనాడు బిచ్కుందలో ఈ అంశంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టమైన ప్రకటన చేశారు. వారంలోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభానికి నోచుకోనున్నదని చెప్పడంతో అధికార యంత్రాంగం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.