నిజామాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కామారెడ్డి/భిక్కనూర్/ దోమకొండ : కేసీఆర్ వస్తే భూములు గుంజుకుంటాడంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తిప్పి కొట్టారు. బీజేపోడికి చేసింది చెప్పుకునే తెలివి లేక, కేసీఆర్‌ను ఎదుర్కొలేక, ఎన్నికల్లో నిజాయితీగా గెలవలేక ప్రజల్లో వైషమ్యాలను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ డబ్బులతో వారిచ్చే సలాకాలు, సిమెంట్, డబ్బులను తీసుకోవాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. అవన్నీ మన కష్టార్జితంతో లాక్కున్న డబ్బులేనని వ్యాఖ్యానించారు. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయా లన్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించ డంతో షబ్బీర్ అలీతో పాటు బీజేపీకి చెమటలు పడుతున్నాయ న్నారు. ఒకరు ఇప్పటికే చేతులు ఎత్తెయ్యగా, మరొకరు సైతం ఆగ మాగం అయ్యే పరిస్థితికి వచ్చిందన్నారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ వేస్తారని, అదే రోజు కామారెడ్డిలో నిర్వహించే బహి రంగ సభకు పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలంతా తరలి రావాలని కోరారు. సభకు వచ్చే జనాలను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మతి పోవాలన్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకునే దుస్థితి ఏర్ప డాలని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో రెండో రోజు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటించారు. భిక్కనూరు, దోమకొండ మండ లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి పక్ష పార్టీల తీరును, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తనదైన శైలిలో తిప్పి కొట్టారు. కామారెడ్డి నుంచి పోటీకి వస్తున్న రేవంత్ రెడ్డిని ఉద్యమ స్ఫూర్తితో మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు.
జంగంపల్లి నుంచి కామారెడ్డి దాకా కేసీఆర్ భూములు లాక్కుంటాడని బీజేపోడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరోపణలు చేస్తున్నోనికి తలకాయ ఉందా. నెత్తిలో మెదడు ఉందా. గంత పెద్ద మనిషి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. కామారెడ్డి భూముల కోసం వస్తాడా. ఆయన ఎందుకొస్తుండు. మీకు తాగు నీరు, సాగు నీరు ఇచ్చేందుకు. పరిశ్రమలు తెచ్చేందుకు వస్తుండు అంటూ కేటీఆర్ చెప్పారు. కేంద్రంలో మోదీ వచ్చి 9 ఏండ్లు అవుతున్నదని, కామారెడ్డికి ఏం చేసిండో బీజేపోడ్ని అడగాలన్నారు. చేసుకున్నది చెప్పుకునే తెలివిలేని దద్దమ్మలని మండిపడ్డారు. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చినట్లుగా కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నాడంటే ఈ ప్రాంతం దశ తిరుగుతదన్నారు. కామారెడ్డికి దశాబ్దాల సమస్యలు నామరూపాల్లేకుండా పోతాయన్నారు. ఏకపక్షంగా ప్రజలంతా తీర్పు ఇస్తారనే విశ్వాసం ఉందన్నారు. షబ్బీర్ అలీ చాలా సార్లు గంపన్న చేతిలో ఓడి పోయిండని, గంప చేతుల్లోనే ఓడిపోయినా… కేసీఆర్ చేతులో ఏం గెలుస్తామని ఆలోచన చేస్తూ నిజామాబాద్‌కు వెళ్లేటట్లు ఉన్నారన్నారు. బీజేపోళ్లు సైతం ఇదే ఆలోచనలో పడ్డారన్నారు. ఎవడొచ్చినా వారిని మరోసారి గంప కింద కమ్మేసుడేనన్నారు.
గుజరాత్ పైసలతో సలాకాలు, సిమెంట్ పంచుతున్నారని, బీజేపోళ్లు ఇచ్చే పిప్పరమెంట్లు, చాక్లెట్లకు ఆశ పడదమా? కేసీఆర్ ఇచ్చే దమ్ బిర్యానీ తీసుకుందా మా అంటూ కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. డిపాజిట్ రాని బీజేపీకి ఓటేసి వేస్టు చేసుకోవద్దన్నారు. సలాకాలు ఇస్తే తీసుకోండి. సిమెంట్ ఇస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయడంటూ హితవు పలికారు. వాళ్లు దేవుడి మీద ప్రమాణం చేయమంటారని, ప్రమాణం చేయమంటే చేయి చాపి మనసులో తుపాల్ తుపాల్ అనుకుని పంపించి, తిరిగి ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలన్నారు. మోసాన్ని మోసంతోనే గెలవాలన్నారు. కామారెడ్డికి వచ్చి కేసీఆర్ ముందు తొడ కొట్టుడు అంటే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్లేనన్నారు. ఉద్యమంలో ఉద్యమకారులపైకి తుపాకీ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డి ఇక్కడచ్చి పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు చేయాలన్నారు. గంప గోవర్ధన్ కోరిక మేరకు కేసీఆర్ మాటిచ్చి ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. కామారెడ్డిలో 9వ తారీఖున నామినేషన్ దాఖలు చేయబోతున్నారని, ఇంటింటికీ ఒక్కొక్కరూ చొప్పున సభకు తరలి రావాలన్నారు.
వచ్చే ప్రభుత్వంలో దోమకొండ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ పౌరుషానికి ప్రతిరూపం కేసీఆర్ స్వయంగా కామారెడ్డికి వస్తే ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంత ఓటర్లదేనన్నారు. హనుమంతుడి గుడి లేని ఊరు లేనట్లే కేసీఆర్ సంక్షేమం అందని కుటుంబం లేదన్నారు. మ్యానిఫెస్టోలోని అంశాలను కూలంకషంగా వివరించారు. సంక్షేమం, అభివృద్ధి ఆగొద్దంటే కారు ఉరుకుతనే ఉం డాలన్నారు. దోమకొండ మండలం కోనాపూర్ గ్రామస్తులు సీఎం కేసీఆర్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం సేకరించిన రూ.50 వేలను సర్పంచ్ నర్సవ్వ, బాల య్య గ్రామస్తులతో కలిసి మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సు భాష్ రెడ్డి, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఎల్.నర్సింగ్‌రావు, వకీల్ రామారావు, ఎం.జి.వేణుగోపాల్ గౌడ్, నల్లవెల్లి అశోక్, గంప శశాంక్, భిక్కనూర్, దోమకొండ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి దేశం లో, తెలంగాణలో పాలించేందుకు 11సార్లు అవకాశం ఇస్తే తాగు నీళ్లు, సాగు నీళ్లు, కరెంట్ ఎందుకు ఇయ్యలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ రాక మునుపు ఊర్లలో కరెంట్‌కు గోస ఎట్లుండే. ఆనాడు ఎవరైనా చచ్చిపోతే మనమే కదా కరెంటోళ్లకు ఫోన్ చేసి అడుక్కున్నామంటూ అంత్యక్రియలకు ఎదుర్కొన్న పాట్లను కేటీఆర్ గుర్తుకు తెచ్చారు. కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు. చెప్పులు లైన్లలో పెట్టిన రోజులు 55 ఏండ్ల కాంగ్రెస్లోనివే కదా అంటూ కేటీఆర్ చెప్పారు. 2014 వరకు కాంగ్రెసోళ్లు రూ.200 పింఛన్లు ఇచ్చి ఇప్పుడు రూ.4వేలు ఇస్తామంటే నమ్ముదామా? అంటూ ప్రశ్నించారు. రైతుబంధు ఆలోచన కాంగ్రెస్‌కు ఎ ప్పుడైనా వచ్చిందా అన్నారు. రైతుకు రైతుబంధు ఇస్తే బిచ్చగాళ్లకు ఇస్తున్నావా? అంటున్న రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని రైతులను కేటీఆర్ కోరారు.
కామారెడ్డి/భిక్కనూర్/దోమకొండ, నవంబర్ 1 : ఎన్నికలు రాగానే మోసపూరిత హామీలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను నమ్మొద్దు. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నరేండ్లలోనే జరిగింది. ఇచ్చిన వాటినే కాకుండా ఇవ్వని హామీలను సైతం సీఎం కేసీఆర్ అమలు చేశారు. కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి.
రైతులకు 24 గంటల కరెంట్, నీళ్లు, నిధులు ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. అలాంటి వ్యక్తి మన కామారెడ్డిలో పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం.
రాష్ట్రం రాక మునుపు రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులను ప్రజలు గమనించాలి. కామారెడ్డిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తున్నారు. కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.
– తిర్మల్ రెడ్డి, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్