కామారెడ్డి, జనవరి 21: కోట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా కేసీఆర్ నిలిపారని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ వద్ద ఉన్న బృందావన్ గార్డెన్లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సన్నాహక సమావేశంలో గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు పట్టం కట్టారని, దీంతో తెలంగాణ తొలి సీఎం రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తుచేశారు.
పాలనా సౌలభ్యం కోసం కామారెడ్డిని జిల్లాగా ఏర్పాటు చేశారని తెలిపారు. కామారెడ్డిలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు కట్టించారని చెప్పారు. పట్టణ పరిధిలోని నర్సన్నపల్లి నుంచి టేక్రియాల్ వరకు, సిరిసిల్లా రోడ్ నుంచి లింగాపూర్ వరకు తొమ్మిది కిలోమీటర్ల వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారన్నారు. పేద ప్రజల కోసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, 350 పడకల దవాఖానను నిర్మించారని చెప్పారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కదానిని సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్.. ఒక గ్రాము కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ జోలికి వస్తే ఖబడ్దర్..
బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడానికి గ్రామాల్లో ఆ పార్టీ గద్దెలను కూలుస్తామని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి అనడం విడ్డూరమని మండిపడ్డారు. బీఆర్ఎస్ జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. రెండేండ్లుగా పట్టణంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు ధ్వంసమయ్యాయని, సీఎం రేవంత్‌రెడ్డి పట్టణంలో పర్యటించి ఐదు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో.. బీఆర్ఎస్ హయాంలో వేసిన రోడ్లనే ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ప్రారంభిస్తున్నారన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పాడని, ఎమ్మెల్యేగా గెలిచి రెండేండ్లు అవుతున్నా.. ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి, బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేయాలని సూచించారు.
రిజర్వేషన్ల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్
మున్సిపల్ ఎన్నికల్లో వార్డులకు ఖరారైన రిజర్వేషన్ల ప్రకారం నాయకులు దరఖాస్తు చేసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ సూచించారు. ఎలాంటి పదవి లేని వ్యక్తి కామారెడ్డి పట్టణంలో ప్రారంభోత్సవాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, నాయకులు గెరిగంటి లక్ష్మీనారాయణ, కాసర్ల స్వామి, కృష్ణాజిరావు, అర్కల ప్రభాకర్ యాదవ్, గోపీగౌడ్, అఫీజ్, భూంరెడ్డి, రాజేశ్వర్ రావు, చెలిమల భాను, శశిధర్ రావు తదితరులు పాల్గొన్నారు.