దళితుల సాధికారత కోసం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడేలా పథకాన్ని రూపొందించారు. స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం నిర్వహించేలా దళితులను ప్రోత్సహించేందుకు ఆర్థిక చేయూతనందించింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ను పైలెట్ మండలంగా ఎంపిక చేసింది. మొదటి విడుతలో 1298 మంది దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున అందజేసింది. దీంతో వారంతా వివిధ వ్యాపార, వాణిజ్య స్వయం ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
రెండో విడుతలో 238 మందితో కూడిన జాబితాను ప్రభుత్వానికి అందజేయగా, అందులో 208 కుటుంబాలకు డబ్బులు విడుదలయ్యాయి. మిగతా 30 కుటుంబాలకు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. సరిగ్గా అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ఖాతాల్లో నిధులు జమ అయినా.. విడుదలకు బ్రేక్ పడింది. దీంతో ఎన్నికల అనంతరం డబ్బులు వస్తాయనుకున్న దళితబంధు లబ్ధిదారులకు షాక్ తగిలింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దళితబంధు నిధుల విడుదలకు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకపోవడంతో ఖాతాలు నిలిచిపోయాయి. దీంతో దళితబంధు వస్తుందా? లేదా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లకు నిధులు ఖాతాల్లో జమ అయినా.. బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నిజామాబాద్ స్పోర్ట్స్, జనవరి 11: రెండో విడుత మంజూరైన దళితబంధును వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ భూమయ్య మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, మొదటి విడుత అమలైన తర్వాత రెండో విడుత లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారన్నారు. బ్యాంకు ఖాతాల పరిశీలన, గ్రౌండింగ్ వర్క్ పూర్తయ్యిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా పథకాన్ని నిలిపివేశారని, ఎన్నికల అనంతరం ఆన్ గోయింగ్ స్కీమ్ కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాల్సి ఉన్నా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దళితులపై కక్షగట్టి దళితబంధును ఆపుతున్నదని ఆరోపించారు. వెంటనే నిధులు విడుదల చేసి దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడాలని విజ్ఞప్తిచేశారు. నిధుల విడుదల చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన దళిత సంఘాల నాయకులు, దళితబంధు లబ్ధిదారులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును కలిసి వినతిపత్రం సమర్పించారు.
దళితబంధు పథకంలో భాగంగా గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లకు నిధులు మంజూరు చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖాతాల్లో పడిన డబ్బులను ఇప్పించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. దళితుల జీవితాలను మార్చేందుకు తీసుకువచ్చిన పథకాన్ని కొనసాగించాలని, ఎంపికైన లబ్ధిదారులందరికీ నిధులు విడుదల చేయాలని కలెక్టర్లను కోరుతున్నారు.
మా కుటుంబానికి దళితబంధు పథకం కింద రూ.10లక్షలు మంజూరయ్యాయి. ఇంతలో నా భర్త చనిపోయిండు. ఆయనకు మంజూరైన పథకాన్ని నా పేరు మీదకు మార్చారు. నా ఖాతాలో రూ.10లక్షలు జమ అయినప్పటికీ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇదేమిటని అడిగితే ఈరోజు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు.
దళితబంధు పథకం కింద కారు తీసుకున్నా. ఇంకా రూ.లక్షా 90వేలు నా ఖాతాలో మిగిలిపోయాయి. వాటి కోసం రోజూ అధికారుల వద్దకు వెళ్తున్నా. రేపు, మాపు అంటున్నారు. ఇప్పటికైనా నా ఖాతాలో ఉన్న డబ్బులు అందిస్తే ఇంటి వద్ద మరో చిన్న వ్యాపారం పెట్టుకుంటా. ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని, టైం పడుతుందని అధికారులు చెబుతుండ్రు.