శక్కర్‌నగర్, జూన్ 22: ‘ఉమ్మడి రాష్ట్రంలో అరకొర కరెంటు సరఫరాతో అష్టకష్టాలు పడ్డం. రైతులందరం రాత్రిపూట బావుల కాడ…చిన్న మిషిన్లు నడుపుకొనేటోళ్లం దుకాణాల్ల పండుకొని కరెంటు కోసం కండ్లల్ల వొత్తులేసుకొని జూసేటోళ్లం.. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కేసీఆర్ సారు కరెంటు విషయంల మస్తు సౌలత్ చేసిండు. రాత్రింబవళ్లు కరెంటు పోకుండా మంచిగ జేసిండు. ఆయన ఉన్నన్ని రోజులు కరెంటు బాధలు తెల్వకుండ ఉన్నం. గిప్పుడు మొన్నొచ్చినోళ్లు మల్లా పాత రోజులను గుర్తుకు తెస్తుండ్రు. ఎక్కడ జూసినా కరెంటు పోవుడు.. వచ్చుడు..ఇదే ముచ్చట వినిపిస్తున్నది. చిన్న వాన పడ్డా కరెంటు పోతున్నది. గా కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఎట్ల జేసిండో.. కరెంటు సక్కగ ఇచ్చిండు..ఆ సారును మొక్కాలె.’ అంటూ రైతులు, చిరుపరిశ్రమల యజమానులు అభిప్రాయపడుతున్నారు.
మొన్నటిదాకా కరెంటు బాధలు లేకుండె..
శక్కర్‌నగర్, జూన్ 22: కేసీఆర్ హయాంలో మొన్నటి వరకు కరెంటు బాధలు అనేవి లేకుండె. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన నుంచి నేను కుట్టుమిషన్ కుడుతున్న. పాత కుట్టుమిషన్‌తో ఎక్కువ బట్టలు కుట్టేందుకు వీలయ్యేది కాక పోతుండె. పొద్దాంత కుట్టినా కుటుంబపోషణకు సరిపోయేది కాదు. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు ఫుల్లుగా కరెంటు ఇచ్చుడు షురూ జేసిండు. ఇగ అప్పుడే కరెంటుతో నడిచే మిషన్లను కొన్న. తక్కువ టైంల ఎక్కువ బట్టలు కుట్టుడు అయితుండె. బట్టలు కుట్టే టైంల కరెంటు పోవుడు ముచ్చటనే లేకుండె. మాలాంటి చిన్నచిన్న దుకాణాల నుంచి పెద్దపెద్ద ఫ్యాక్టరీల వరకు అందరికీ కరెంటు మంచిగ ఇచ్చిండు. తెలంగాణ డవలప్ అయ్యిందంటే కేసీఆర్ సారు ఇచ్చిన కరెంటుతోనే. అసొంటి సారును కొత్తగా వచ్చిన సర్కారోళ్లు ఇబ్బంది పెట్టుడు కరెక్టు కాదు. ముందు కరెంటు మంచిగ ఇచ్చి చూపెట్టుండ్రి.
– అబ్దుల్ సమద్, టైలర్, ఎడపల్లి
ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవికాదు..
రుద్రూర్, జూన్ 22: కేసీఆర్ ఉన్నప్పుడు 24గంటలు కరెంటు ఉంటుండే. రైతుల ఎప్పుడంటే అప్పుడే తమకు వీలైన సమయంలో పొలం పారబెట్టుకొని వెళ్తుండే. కేసీఆర్ హయాంలో రైతులకు ఎలాంటి లోటు కూడా రాలేదు. 24గంటలకు కరెంటు ఇస్తుండడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడాలు కూడా తక్కువుండే. ఇప్పుడు ప్రభుత్వం మారింది. రోజు ఏదో ఒక టైములో కరెంటు పోతున్నది. మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయేమోనని భయంగా ఉంది.
-బొట్టె ప్రభాకర్ యాదవ్,కౌలు రైతు
నారు ఎండిపోతున్నది..
నవీపేట, జూన్ 22: ఇప్పడు వాన కాలం పంట పనులు మొదలైనయి. నారు పోసినం. నారుకు నీరు పెట్టేందుకు కరెంట్ పోయినప్పడుల్లా చాలా ఇబ్బందులుపడుతున్నం.పోసిన నారుకు నీరు అందక నీరు ఎండి పోతుంది. 24 గంటల తీఫేస్ కరెంట్ సరిగ్గా ఉంట లేదు. నాకు ఐదెకరాల్లో పంట వేసినం. కరెంట్ సరిగ్గా ఇవ్వక పోగా ఇటు వర్షాలు కూడా కురువడంలేదు. ఎండలకు నారు ఎండి పోతుంది.
-బైండ్ల చిన్న సాయిలు రైతు రాంపూర్ నవీపేట మండలం..