నందిపేట్, డిసెంబర్ 19: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే రేవంత్ సర్కారు అక్రమంగా కేసులు పెట్టిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసులతో తమ గొంతు నొక్కలేరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత వేర్వేరు ప్రకటనల్లో స్పష్టం చేశారు.
ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌పై నమోదు చేసిన కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని గురువారం విమర్శించారు. ఈ రకమైన కాంగ్రెస్ దుశ్చర్యలు బీఆర్ఎస్ నేతల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.
కేటీఆర్ అంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుడుతున్నదని, ప్రజా సమస్యలపై ఆయన సాగిస్తున్న పోరాటాలకు భయపడి కేసులతో వేధిస్తున్నదని ధ్వజమెత్తారు. కేటీఆర్‌పై తప్పుడు కేసు నమోదుచేయడాన్ని జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దబాయింపు ధోరణితో అక్రమ కేసులు పెడుతున్నదని ఆరోపించారు. తెలంగాణ ఇమేజ్ పెంచడానికి పనిచేసిన కేటీఆర్ మీద అన్యాయంగా కేసుపెట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదన్నారు.
ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు పెడితే సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నట్లు కేటీఆర్ స్పష్టంచేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సీఎం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పోరాడుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యవాదులు కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించాలని జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని బనాయిస్తున్న కేసులను ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేయాలని చూడడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదు. కేసీఆర్ సైనికులం, తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టుకొచ్చిన మమ్మల్ని మీ చిల్లర వ్యూహాలు భయపెట్టలేవు. పోరాటం మాకు కొత్త కాదు. అక్రమ కేసులతో గొంతు నొక్కలేరు.
– కవిత, ఎమ్మెల్సీ
అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా హామీలు అమలుచేయలేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. అందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఫార్ములా ఈ రేస్‌ను ప్రపంచంలోనే అనేక గొప్ప నగరాలను కాదనుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్‌ది. కానీ రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ రేస్‌ను రద్దు చేయడమే కాకుండా ఈ రేస్ నిర్వహణలో అవినీతి జరిగిందంటూ కేటీఆర్‌పై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నది. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రశ్నిస్తున్నందునే కేటీఆర్ అడ్డు లేకుండా చేయాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నాడు. దీనిపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండని కేటీఆర్ అడుగుతున్నా ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోతున్నది.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే